బ్యానర్స్: అలుకా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్
నటీనటులు: రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్, గోవింద్ శ్రీనివాస్, శివరాజ్, ఎస్‌ఆర్‌కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్, కిరణ్ మేడసాని మరియు ఇతరులు
రచన & దర్శకత్వం: రామచంద్ర వట్టికూటి
నిర్మాతలు: మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల
సినిమాటోగ్రఫీ: భరద్వాజ్, ఫణింద్ర
సంగీతం: వెంకీ వీణ
ఎడిటింగ్: లోకేష్ కడలి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పర్వతనేని రాంబాబు
మటన్ సూప్ సమీక్ష: నిజ జీవితంలో జరిగే నేరాలు కొన్నిసార్లు సినిమాల్లో చూపించే దానికంటే ఎక్కువ ఆశ్చర్యం కలిగిస్తాయి. “ఇలాంటి పథకంతో కూడా నేరం చేస్తారా?” అని అనిపిస్తుంది. అలాంటి నిజ ఘటన ఆధారంగా రూపొందిన చిత్రమే ‘మటన్ సూప్’. ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. టైటిల్ ఎందుకు ‘మటన్ సూప్’ అని పెట్టారు? దర్శకుడు రామచంద్ర వట్టికూటి ఈ చిత్రం ద్వారా ఏ సందేశాన్ని అందించాలనుకున్నాడు? సినిమా ఆకట్టుకుందా లేక నిరాశపరిచిందా? ఈ విషయాలను తెలుసుకోవాలంటే, ముందుగా కథలోకి వెళ్దాం.
కథ: శ్రీరాం (రమణ్) ఒక ఫైనాన్స్ వ్యాపారి, అప్పులు వసూలు చేయడంలో కఠినంగా వ్యవహరిస్తాడు. తన భాగస్వామితో కలిసి నడిపే ఈ వ్యాపారం వల్ల అతనికి చాలా మంది శత్రువులు ఏర్పడతారు. కొన్నిసార్లు అతనిపై దాడులు కూడా జరుగుతాయి.. కానీ అతను తప్పించుకుంటాడు. ఫేస్‌బుక్ ద్వారా సత్యభామ (వర్ష విశ్వనాథ్)తో పరిచయమై, ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. ప్రేమికుల రోజున పార్క్‌లో ఉన్న వీరిద్దరినీ గజగంగ్ దళ్ సభ్యులు బలవంతంగా పెళ్లి చేస్తారు. సత్యభామతో ఇంటికి వెళ్లిన శ్రీరాంకు తీవ్ర నిరాశ ఎదురవుతుంది. తని తల్లి మరియు అన్న అతన్ని ఇంటి నుంచి గెంటేస్తారు. ఆర్థికంగా స్థిరంగా ఉన్న శ్రీరాం వేరే ఇంటిలో కాపురం పెడతాడు. అంతా సవ్యంగా సాగుతుందనుకునే సమయంలో, అతనిపై మరోసారి దాడి జరుగుతుంది. ఈసారి యాసిడ్‌తో దాడి చేయడంతో అతని ముఖం కాలిపోతుంది, ఆసుపత్రిలో చేరతాడు. సత్యభామ అతన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇదే సమయంలో శ్రీరాం కజిన్ శివరాం (జెమినీ సురేష్) ఒక పోలీసు అధికారి. ఈ దాడి ఎవరు చేశారు, ఎలా జరిగింది అనే విషయాలను విచారించడం ప్రారంభిస్తాడు. శ్రీరాంపై దాడి చేసింది ఎవరు? కృష్ణతో శ్రీరాంకు సంబంధం ఏమిటి? శ్రీరాం తల్లికి ఉన్న అనుమానం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read – Telusu Kada: శ్రీనిధి శెట్టి చెప్పే యూనిక్ రొమాన్స్ పాయింట్ అదిరిపోయేలా!
సమీక్ష: చాలా మంది కొత్త దర్శకులు తక్కువ బడ్జెట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్ జానర్‌లను ఎంచుకుంటారు. ‘మటన్ సూప్’ దర్శకుడు రామచంద్ర వట్టికూటి కూడా అలాంటి కథనే ఎంచుకున్నాడు. అయితే కల్పిత కథను సృష్టించకుండా నిజ జీవితంలో జరిగిన ఒక నేర ఘటనను ఆధారంగా తీసుకుని దాని చుట్టూ కథను అల్లడం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. సన్నివేశాలను ఆసక్తికరంగా రాసుకున్న విధానం బాగుంది. ఒకవేళ కాస్త ఎక్కువ బడ్జెట్ అందుబాటులో ఉంటే దర్శకుడు మరింత ఉన్నతమైన నిర్మాణ విలువలతో ఆకర్షణీయమైన లుక్‌తో సినిమాను తీసుండేవాడు. అయినప్పటికీ.. తనకు అందుబాటులో ఉన్న వనరులతో ఆర్థిక పరిమితులను అధిగమించి ‘మటన్ సూప్’ను చక్కగా తెరకెక్కించాడు.
నటీనటుల విషయానికొస్తే.. రమణ్ ఈ చిత్రంలో రెండు పాత్రల్లో కనిపించాడు. తన మునుపటి చిత్రంతో పోలిస్తే ఈ సినిమాలో అతని నటన సమర్థవంతంగా ఉంది. హీరోయిన్ వర్ష విశ్వనాథ్ చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. నటనలో మరింత మెరుగుపడాల్సిన అవసరం కనిపిస్తుంది. జెమినీ సురేష్ పోలీసు అధికారి పాత్రలో ఒదిగిపోయాడు. గోవింద్ శ్రీనివాస్ తన పాత్రను చక్కగా పోషించాడు. గోపాల్ మహర్షి, కిరణ్ మేడసాని, సనపల రామకృష్ణ, చరణ్ తదితరులు తమ పాత్రల పరిధిలో బాగానే నటించారు. భరద్వాజ్ మరియు ఫణింద్ర సినిమాటోగ్రఫీ, వెంకీ వీణ సంగీతం సమర్థంగా ఉన్నాయి. నేర ఘటనను తెరకెక్కించిన తీరు, సస్పెన్స్ అంశాలతో కథను విడమరిచిన విధానం దర్శకుడి నైపుణ్యాన్ని చాటుతుంది. అయితే.. కథనం మరింత ఆకర్షణీయంగా ఉంటే బాగుండేదనిపిస్తుంది. సెకండ్ హాఫ్ గ్రిప్పింగ్‌గా ఉన్నప్పటికీ, ఫస్ట్ హాఫ్ అంతగా ఆకట్టుకోదు. ఎడిటింగ్‌లో మరికాస్త శ్రద్ధ పెడితే సినిమా మరింత సాంద్రంగా ఉండేది. మొత్తంగా చూస్తే ‘మటన్ సూప్’ ఒక ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్‌గా నిలుస్తుంది.


