Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభDaredevil: బాలివుడ్ స్టంట్ క్వీన్

Daredevil: బాలివుడ్ స్టంట్ క్వీన్

ఇక్కడ కనిపిస్తున్న ఆమె బాలివుడ్ స్టంట్ క్వీన్. భారతదేశంలో తొలి ‘స్టంట్ డబుల్’ ప్రొఫెషనల్. గాలిలో ఎగరడం నుంచి భూమి మీద, సముద్రపు నీటిలో సైతం స్టంట్లు చేస్తారామె. కొండల మీద నుంచి, హెలికాప్టర్ల నుంచి దూకుతారు. తుపాకులు, రైఫిళ్లు, రకరకాల ఆయుధాలతో యాక్షన్ సీన్లు పండిస్తారు. ఫైర్ స్టంట్లు, వెహికల్స్ తో స్టంట్లలో దూసుకుపోతారు. మిక్స్ డు మార్షల్ ఆర్ట్స్ లో కూడా అందివేసిన చేయి ఆమె. బాలివుడ్ తారలు తెరపై చేసే సాహసాల వెనుక స్టంట్ క్వీన్ ఆమే . ఆమే ఇక్కడ కనిపిస్తున్న సనోబర్ పార్దివల్లా….

- Advertisement -

ఇక్కడ కనిపిస్తున్న యువతి మనదేశంలో తొలి స్టంట్ విమెన్. ఆమె పేరు సనోబర్ పార్దివల్లా. చిన్నప్పటి నుంచి సాహసాలు చేయడమంటే సొనాబర్ పార్దివల్లాకు ఎంతో ఇష్టం. పన్నెండేళ్ల వయసులోనే కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించింది. అంతటితో ఆగలేదు. స్విమ్మింగ్ లో కూడా పట్టు సంపాదించుకుంది. ప్రొఫెషనల్ స్విమ్మర్ అయింది. బాలివుడ్ లో ఉర్మిలా మండోడ్కర్ కు స్టంట్ డబుల్ గా 2003లో భూత్ సినిమా ద్వారా బాలివుడ్ ప్రవేశం చేసింది.

ఐశ్వర్యారాయ్ కి స్టంట్ విమన్ గా ఒక కమర్షియల్ లో చేసింది. స్టంట్ విమన్ గా కెరీర్ లో ఎదిగే క్రమంలో ఆమె ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసింది. కానీ గట్టి పట్టుదలతో అతికొద్ది కాలంలోనే బాలివుడ్ లోని ఎందరో తారలకు ఎన్నో ప్రాణాంతకమైన స్టంట్స్ చేసి బెస్ట్ విమన్ స్టంట్ పర్ఫామర్ గా పేరు తెచ్చుకుంది. షూటింగులో ఉన్నా ఒక్కరోజు కూడా వర్కవుట్స్ చేయకుండా ఉండేది కాదు. డైట్ విషయంలో కూడా ఎంతో క్రమశిక్షణ పాటిస్తుంది. రకరకాల మార్షల్ ఆర్ట్స్ లో ఆమెది అందెవేసిన చేయి. మే థాయ్, జు జిట్ సు వంటి వాటిల్లో సైతం పార్దివల్లా ఎంతో ఆరితేరిన మార్షల్ ఆర్టిస్టు. పార్దివల్లా శిక్షణ పొందిన జిమ్నాస్ట్ కూడా.

చైనాలో షావులిన్ టెంపుల్ ట్రైనింగ్ సైతం ఆమె నేర్చుకుంది. దీన్ని నేర్చుకోవాలాంటే సైనికులు సైతం భయపడతారు. అంత క్లిష్టమైన దానిలో సైతం ఆమెకు ఎంతో పట్టు ఉంది. గ్లాస్ బ్రేకింగ్ స్టంట్స్, ఆయుధాలతో, పిస్తోలు, రైఫిళ్లతో యాక్షన్ సీన్స్ చేయడంతో పాటు హెలికాప్టర్ నుంచి, కొండలపై నుంచి దూకడం వంటి ఎన్నో సాహసాలను పలు సినిమాల్లో స్టంట్ డబుల్ గా చేశారు. ఆమె చేయని ఫిజికల్ ఫీట్ అంటూ ఏమీ లేదంటే అతిశయోక్తి కాదు. ‘ మేం ఎప్పుడూ ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి. స్టంట్స్ బాగా చేయాలంటే మా శరీరం ద్రుఢంగా, ఫిట్ నెస్ తో ఉండాలి. శరీరం అలా ఉండాలంటే కఠినమైన శిక్షణ నిత్య కొనసాగించాలి’ అంటారు ఎక్సెర్ సైజ్ ఫిజియాలజిస్టు కూడా అయిన పార్దివల్లా. ఈ ప్రొఫెషన్ ఎంతో రిస్కుతో కూడినది. దానిపై మాట్లాడుతూ ‘ఇలాంటి ప్రొఫెషన్ లో ప్రమాదాల పాల బడే అవకాశం ఎప్పుడూ పొంచి ఉంటుంది. అందుకే మరో పని కూడా చేయగలిగేలా నన్నునేను సంసిద్ధం చేసుకున్నా. ఆర్థికంగా స్వతంత్రంగా ఉండడానికి నేను చాలా ప్రాధాన్యం ఇస్తా. అందుకే ఎక్సెర్ సైజ్ ఫిజియాలజిస్టుగా శిక్షణ తీసుకున్నా. న్యూట్రిషన్ కోర్సు కూడా చేశాను’ అని పార్దివల్లా తెలిపారు.

పార్దివల్లా సెలబ్రిటీలకు ఫిట్ నెస్ ట్రైనర్ కూడా. క్లినికల్ హిప్నోథెరపీలో డాక్టరేట్ తీసుకుంది. అమెరికన్ కాలేజ్ ఇన్ స్పోర్ట్ మెడిసెన్ నుంచి న్యూట్రిషన్ లో పట్టా తీసుకుంది. గాలిలో ఎగరడం, నేల మీద, నీళ్ల్లో సైతం స్టంట్స్ అద్భుతంగా చేస్తుంది పార్దివల్లా. కార్లు, బైకులతో చేసే హైస్పీడ్ స్టంట్స్ లో పార్దివల్లా స్టంట్స్ స్టైలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. పార్దివల్లా బాలివుడ్ లోకి అడుగుపెట్టే టప్పటికి అక్కడ స్టంట్ మ్యాన్ లే తప్ప స్టంట్ విమెన్ లు లేరు. ‘ అప్పట్లో నన్ను కొందరు స్టంట్ మ్యాన్ అని పిలిచేవారు. అలా పిలిచే వారిని నేను కరక్టు చేసేదాన్ని. అప్పటి నుంచే స్టంట్స్ చేసే ఎవరినైనా సరే (స్త్రీ లేదా పురుషుడు )వారిని స్టంట్ డబుల్ అనడం మొదలైంది’ అని పార్దివల్లా చెప్పుకొచ్చారు.

పదిహేనేళ్ల ప్రాయంలోనే పార్దివల్లా ‘భూత్’ సినిమాకోసం పదహారవ అంతస్తు నుంచి దూకే స్టంట్ చేసింది. ‘హీరో’, ‘లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై’ సినిమాలో ప్రీతి జింతాకు స్టంట్ డబుల్ గా పార్దివల్లా చేశారు. ‘ డోలీ కి డోలీ’, ‘ఓకె జాను’, ‘రేస్’, ‘సుల్తాన్’ ‘రబ్ నే బనాది జోడి’, ‘ధూమ్ 1’, ‘ధూమ్ 2’,‘ త్రి ఇడియట్స్’ వంటి ఎన్నో సినిమాల్లో రక రకాల స్టంట్స్ చేశారు. అలాగే చాలా సినిమాల్లో భయంగొలిపే కార్ క్రాష్ సీన్స్ రూపకల్పన వెనుక పార్దివల్లా ఉన్నారు. ఏ స్టంట్ చేసినా దాని తర్వాతి పరిణామాలను సైతం వేగంగా అంచనా వేయగల ప్రతిభ ఆమె సొంతం. ఒక్కమాటలో చెప్పాలంటే పార్దివల్లా స్టంట్ క్వీన్. తాపసీ పన్ను, ప్రియాంక చోప్ర జోనస్, అనుష్కశర్మ, కరీనా కపూర్, ఆలియా భట్ , దీపికాపడుకోన్, విద్యాబాలన్, సోనాక్షిసిన్హా లాంటి బాలివుడ్ తారలకు స్టంట్ విమన్ గా పార్దివల్లా పనిచేశారు.

ఆమె చేసిన అండర్ వాటర్, ఫైర్ స్టంట్స్ ఎన్నో. స్టంట్స్ లో అస్కార్ గా భావించే టారస్ వరల్డ్ స్టంట్ అవార్డ్సులో ఆమె చేసిన సాహసోపేతమైన యాక్షన్ స్టంట్స్ కు పార్దివల్లా పలుమార్లు నామినేట్ అయ్యారు కూడా. బాగ ఎత్తుల నుంచి దూకడం దగ్గర నుంచి ఫైర్, అండర్ వాటర్ షూటింగ్స్ ఇలా ఆమె చేయని స్టంట్ పర్ఫామెన్సులు లేవంటే అతిసయోక్తి కాదు. 20 ఏళ్ల ఆమె బాలివుడ్ కెరీర్ లో 200 పైగా సినిమాలకు స్టంట్ విమన్ గా పనిచేశారు. వీటిల్లో హాలివుడ్ సినిమాలైన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’,‘ ఎ హండ్రడ్ ఫుట్ జర్నీ’ కూడా ఉన్నాయి.‘ రావణ్’, ‘ధూమ్ 2’, ‘బ్యాంగ్ బ్యాంగ్’ వంటి సినిమాల్లో ఆమె రూపొందించిన, చేసిన యాక్షన్ స్టంట్లతో పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులకు ఆమె నామినేట్ అయ్యారు.

సినిమాల్లో కత్రినా కైఫ్ ఎత్తైన బిల్డింగుల నుంచి దూకడం, కార్ క్రాషస్ లో తాపసీ పన్ను యాక్షన్ సీన్స్ చూసి వీక్షకులు ఎంతో థ్రిల్ అవడం తెలుసు. కానీ వీటిని రియల్ గా ఎంతో సాహసంగా చేసిన స్టంట్ విమెన్ సనోబర్ పార్దివల్లా. ఇటీవల ఆమె బంటీ ఔర్ బబ్లీ, షంషేరా, గెహ్ రాయియాన్, అత్రంగి రే సినిమాలకు కూడా పనిచేశారు. బాలివుడ్ లోని ప్రతి హీరోయిన్ సాహసాల వెనుక పార్దివల్లా అనే డేర్ డెవిల్ ఉందన్నది మర్చిపోలేము. బైక్స్, కార్లతో చేసే స్టంట్లంటే తనకు చాలా ఇష్టమంటారు ఈ ప్రొఫెషనల్ స్టంట్ ఆర్టిస్ట్. 23 ఏళ్లకే లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డును అందుకున్న పార్దివల్లా సగం పైగా ప్రపంచాన్ని చుట్టేశారు.

ఎన్నో అడ్వంచర ప్లేసెస్ కు వెళ్లారు. అన్ని వయసుల వారికీ హెల్త్, ఫిట్ నెస్ శిక్షకురాలిగా పదకొండేళ్లుగా సేవలు అందిస్తున్నారు. ఎన్నో షోలలో, కమర్షియల్స్ లో కూడా అద్భుతమైన, సాహసోపేతమైన స్టంట్స్ ను ప్రదర్శించారు. రైఫిల్, పిస్తోల్ లతో షూటింగ్ చేయడంలో కూడా మంచి ప్రతిభావంతురాలు. ఆమె బెస్ట్ సమురై కూడా. విప్ చెయిన్ తో ఆమె చేసే వేగవంతతమైన కదలికలు ఎంతో సాహసోపేతంగా ఉంటాయి. అండర్ వాటర్ స్టంట్స్ అంటే పార్దివల్లాకు చాలా ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను అడ్వాన్స్ డు డీప్ సీ డైవర్ ని కూడా చేసింది. ఇది కాకుండా ఆమె సర్టిఫైడ్ పేరా గ్లైడర్, స్కై డైవర్ కూడా. ఇలా పలు వాటిల్లో పార్దివల్లాకు ఉన్ననేర్పరితనం చూస్తే ఆమెకు రానిదంటూ ఏదీ లేదనిపిస్తుంది. బాలివుడ్ లో ఆమె చేసిన సాహసోపేతమైన, అద్భుతమైన స్టంట్ ప్రదర్శనలకు గాను 2010 లో పార్దివల్లా దారాబ్షా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు వచ్చింది. పార్దివల్లా ఉదయం మూడు గంటలు, సాయంత్రం రెండు గంటల పాటు ఎంతోమందికి ట్రైనింగ్ ఇస్తారు. ఎందరో ప్రముఖులకు పర్సనల్ ట్రైనర్ గా, వెల్ నెస్ కోచ్ గా కూడా పార్దివల్లా వ్యవహరిస్తున్నారు. ఈ స్టంట్ క్వీన్ ఎందరో మహిళలకు స్ఫూర్తి అనడంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News