నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రాబిన్ హుడ్’ మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇందులో ప్రత్యేక పాత్రలో నటించటం హైప్‌ను మరింత పెంచింది. తెలుగు సినిమాల పాటలు, డైలాగ్‌లతో నెటిజన్లను అలరించిన వార్నర్, తానూ వెండితెరపై కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది.
డేవిడ్ వార్నర్ పాత్రపై అభిమానుల నిరాశ: ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ పాత్ర గురించి ముందే చాలా ప్రచారం జరిగింది. అయితే అతని పాత్ర కేవలం క్లైమాక్స్‌లోనే కనిపించడంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సుమారు రెండు నిమిషాల పాటు మాత్రమే ఉండగా.. అది కూడా పూర్తిగా నెగటివ్ షేడ్స్‌లో కనిపించటం ఆసక్తిని రేకెత్తించింది. ఇది కేవలం ఒక ఇంట్రడక్షన్ మాత్రమేనని స్పష్టంగా చూపించారు. దీంతో ఇంతేనా అని కొందరు అభిమానులు నిరాశ చెందగా.. కొందరు మాత్రం సీక్వెల్‌కు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక సినిమా చివర్లో ‘రాబిన్ హుడ్’కు సీక్వెల్ ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. సీక్వెల్ టైటిల్ ‘బ్రదర్ హుడ్ ఆఫ్ రాబిన్ హుడ్’ అని కూడా రివీల్ చేశారు. ఈ సీక్వెల్‌లో డేవిడ్ వార్నర్ ప్రధాన ప్రతినాయకుడిగా ఉంటాడని క్లైమాక్స్‌లో హింట్ ఇచ్చారు. దీంతో క్రికెట్ మైదానంలో తన దూకుడు గేమ్‌తో ఆకట్టుకున్న వార్నర్, ఇప్పుడు వెండితెరపై ఫుల్ లెంగ్త్ విలన్‌గా కనిపించబోతున్నాడా.. అనే ఆసక్తి నెలకొంది.
సీక్వెల్‌పై అంచనాలు: ప్రస్తుతం ‘రాబిన్ హుడ్’ సినిమా మిక్స్‌డ్ టాక్ వినిపిస్తుంది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కలెక్షన్స్ నమోదు చేస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ డేవిడ్ వార్నర్ విలన్‌గా సీక్వెల్ వస్తుందని అఫీషియల్‌గా ప్రకటించడంతో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ప్రస్తుతం నితిన్, డేవిడ్ వార్నర్ కాంబినేషన్‌లో పెద్దగా ఫేస్ టు ఫేస్ సీన్స్ లేవు, కానీ సీక్వెల్‌లో మాత్రం వారిద్దరి మధ్యనే ప్రధానంగా పోరు జరుగుతుందని ఊహాగానాలు మొదలయ్యాయి.
మొత్తానికి క్రికెట్ మైదానంలో ఓపెనర్‌గా గర్జించిన డేవిడ్ వార్నర్, ఇప్పుడు వెండితెరపై విలన్‌గా ఎలా అలరిస్తాడో చూడాలి. ఈసారి ఫుల్ లెంగ్త్ రోల్‌లో వస్తే, ఇది తెలుగులో క్రికెటర్‌గా తొలి మేజర్ విలన్ రోల్ అవుతుందనే ఆసక్తి నెలకొంది. మరి మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను ఎలా రూపొందిస్తారో వేచి చూడాలి.