Mayasabha Review: వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించే దర్శకుడిగా పేరున్న దేవా కట్టా షో రన్నర్‌గా రూపొందించిన వెబ్ సిరీస్ ‘మయసభ’. దేవాకట్టాతో పాటు కిరణ్ జయ్ కుమార్ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. తెలుగు రాష్ట్రాల్లో పేరున్న ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య ఉన్న స్నేహాన్ని, రాజకీయ పరమైన ఆలోచనలను ఇందులో చూపించారు. ఈ సిరీస్ చూస్తే దేవా కట్టా చంద్రబాబు నాయుడు. వైఎస్.రాజశేఖర్ రెడ్డిలను దృష్టిలో పెట్టుకునే ఈ సిరీస్ చేశాడనిపిస్తుంది. కానీ ఎక్కడా వారిని దృష్టిలోపెట్టుకుని ఈ సిరీస్ చేశానని దేవా కట్టా చెప్పలేదు. ఇక సిరీస్ విషయానికి వస్తే ఇందులో చంద్రబాబు నాయుడు పాత్రలో ఆది పిని శెట్టి నటిస్తే, వై.ఎస్.ఆర్ పాత్రలో చైతన్యరావు నటించారు. సాధారణంగా సీబీఎన్, వైఎస్ఆర్ పేర్లు చెబితే రాజకీయ ప్రత్యర్థులుగానే మాట్లాడుతారు. కానీ వారి మధ్య ఉన్న స్నేహం గురించి చాలా మందికి తెలియదు. ఆ కోణాన్ని దేవాకట్టా ఈ సిరీస్‌లో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇంతకీ సిరీస్ ఎలా ఉంది.. దేవాకట్టా ఏం చెప్పాలనుకున్నారనే విషయాల్లోకి వెళితే..
కథ:
సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి కృష్ణమ నాయుడు (ఆది పినిశెట్టి)కి కాలేజీ రోజుల నుంచి రాజకీయాలంటే ఆసక్తి ఏర్పడుతుంది. ప్రజా సేవ చేయాలని అనుకుటుంటాడు. కానీ ఎలాంటి మద్ధతు ఉండదు. మరో వైపు బాంబుల శివారెడ్డి కొడుకు రామిరెడ్డి(చైతన్య రావు) డాక్టర్. తండ్రి చేసే ఫ్యాక్షన్ పనులను ఎదిరిస్తుంటాడు. ఓ యాక్సిడెంట్ జరిగినప్పుడు వీరిద్దరూ కలుసుకుంటారు. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. స్నేహితులుగా ప్రారంభమైన వారి ప్రయాణం రాజకీయాల వైపుకు ఎలా మారింది? పాలిటిక్స్ పరంగా ఇద్దరూ ఎదుర్కొన్ సవాళ్లేంటి? చక్రధర్ రావు (సాయికుమార్) ఎందుకు తెలుగు రాష్ట్రంలో కొత్త పార్టీని పెట్టాడు? కృష్ణమ నాయుడు అతని అల్లుడు కావటం వెనుకున్న కారణమేంటి? కృష్ణమ నాయుడు, రామి రెడ్డి పొలిటికల్ జర్నీ ఎలా సాగింది? అనే విషయాలను తెలుసుకోవాలంటే మాత్రం ‘మయసభ’ సిరీస్ చూడాల్సిందే.
Also Read- Rakul Preet Singh : బులెట్ కాఫీతో డే స్టార్ట్ చేసి..దూసుకుపోవడమే..రకుల్ రహస్యం!
విశ్లేషణ:
దర్శకులిద్దరూ ఇది ఫిక్షనల్ కథ అని చెప్పినా సిరీస్ చూస్తే ఇది ఎవరి పాత్రలో చిన్న పిల్లాడికైనా అర్థమైపోతుంది. సిరీస్ చూస్తున్నంత సేపు వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడుతో పాటు ఇందిరా గాంధీ, వంగవీటి మోహనరంగ, నాదెండ్ల భాస్కర్‌రావు, పరిటాల రవి తదితరులు గుర్తుకు రాక మానరు. దర్శకుడు దేవాకట్టా తను చెప్పాలనుకున్న విషయాన్ని పక్కాగా చెప్పారు. ఒకరి సైడ్ తీసుకోకుండా కంటెంట్‌ను కనెక్టింగ్‌గా ఎలా చూపించాలనే విషయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. రెండు ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా కంటెంట్‌ను తెరకెక్కించారు. ఈ సిరీస్ సీజన్1కృష్ణమ నాయుడు, రామిరెడ్డి పాత్రల మధ్య స్నేహం ఎలా మొదలైంది.. రాజకీయ శత్రువులుగా ఎలా మారారు. వారి రాజకీయ ప్రయాణం ఎలాంటి మలుపులు తీసుకుందనే దాన్ని చూపించటానికి పరిమితమైంది.
రాజకీయాల్లో కులం ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే విషయాలను దేవా కట్టా సందర్భానుసారంగా సన్నివేశాల్లో, వాటికి తగ్గట్లుగా డైలాగ్స్ రూపంలో చూపించారు. డైరెక్టర్‌గా, రైటర్‌గా దేవాకట్టా తనదైన మార్క్ చూపించాడు. కథానుగుణంగా కొంత మేరకు లిబర్టీ తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ వ్యూహాలు వేయటంలో కృష్ణమ నాయుడు పాత్రను దిట్ట అని చూపించిన దేవాకట్టా, రామిరెడ్డి పాత్ర కులం అండ కోరుకున్నట్లు చూపించారు. ప్రతీ సన్నివేశం ఆసక్తికరంగా తెరకెక్కించలేదు. హాస్పిటల్ సీన్, కాలేజీలో చూపించిన లవ్ స్టోరీ వంటి సన్నివేశాలు కొందరికి నచ్చవు. చక్రధర్ రావు పాత్ర ఎంట్రీతో కథలో వేగం పుంజుకుంది. ఆయన పాత్ర సీఎం కావటం వరకు చూపించటంతో సీజన్1ను దేవాకట్టా పూర్తి చేశారు. ఇక తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు, వాటి వల్ల రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పెను మార్పులు కోసం సీజన్2ను చూడాల్సిందే.
దేవా కట్టా, జయ్ కిరణ్ రావు దర్శకత్వ ప్రతిభ సన్నివేశాల్లో కనిపించింది. నటీనటులు, టెక్నీషియన్స్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. ఇలాంటి పీరియాడిక్ టచ్‌తో పాటు సెన్సిటివ్ పొలిటికల్ సబ్జెక్ట్‌ను తెరకెక్కించటం కత్తిమీద సాము. దాన్ని డైరెక్టర్స్ తెరకెక్కించిన తీరు అభినందించాల్సిందే. ఏ పాత్ర మరొకరికరినీ ఇమిటేట్ చేస్తున్నట్లు చూపించలేదు. అయితే సీజన్1ను జాగ్రత్తగా హ్యాండిల్ చేసిన దర్శకులు సీజన్2లోని రాజకీయ కోణాలను ఎలా తెరకెక్కిస్తారో చూడాలనే ఆసక్తి మాత్రం కలిగింది.


