తమిళ హీరో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుష్.. ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా తనకంటూ ఓ స్థానం ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోని ఈ నేచురల్ హీరో.. ఇప్పుడు మాత్రం ఆయన సినిమా రాబోతుందంటే చాలు, ఆసక్తిగా ఎదురుచూడుతున్నారు. ఇటీవల తెలుగు దర్శకులే నేరుగా ధనుష్‌తో సినిమాలు చేస్తున్నారంటే తెలుగులో ఆయన క్రేజ్ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు.
ఇంత క్రేజ్‌కు కారణం రఘువరన్ B.Tech.. ఈ సినిమా వచ్చిన తర్వాత ధనుష్ నటించిన చిత్రాలు తమిళంతో పాటు తెలుగులోనూ సింక్ రిలీజ్ అవుతున్నాయి. కేవలం నటుడిగానే కాకుండా, వేగంగా సినిమాలు పూర్తి చేసే హీరోగా కూడా మంచి పేరున్న ధనుష్.. తిరు, సార్ సినిమాలతో వంద కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేర సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేందుకు రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ రావటంతో, తాజాగా టీజర్ మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్ చూస్తే.. శేఖర్ కమ్ముల టేకింగ్ మళ్ళీ ఒక సరికొత్తగా ఉంది. కథకు పెద్దగా హింట్ ఇవ్వకుండా, కాన్సెప్ట్‌ను ఆసక్తికరంగా ప్రెజెంట్ చేశారు. ముఖ్యంగా జిమ్ సారభ్ పాత్ర చాలా ఇంట్రిగ్యూయింగ్‌గా అనిపిస్తుంది. అతను అపర కుబేరుడుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జునను ఓ పెద్ద స్కామ్‌లో ఇరికించేది కూడా అతడే కావచ్చునన్న అభిప్రాయం వస్తోంది. ఈ కథలో ధనుష్ పాత్ర చాలా మల్టీ షేడెడ్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది ఒక సీన్‌లో ఆకలితో బిచ్చగాడిలా.. మరొక సీన్‌లో ఫ్యామిలీతో సంతోషంగా కనిపించడం ఆసక్తికరంగా ఉంది.
బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించిన మాంటేజ్ పాట టీజర్‌కు అదనపు ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా, కుబేర టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా కనిపించనుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.