Tollywood Movies: పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్‌కు సంబంధించి టాలీవుడ్‌లో సందిగ్ధత నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలను చెప్పిన డేట్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో దర్శకనిర్మాతలు ఫెయిలవుతున్నారు. పదే పదే రిలీజ్ డేట్స్ మారుస్తూ ఆడియెన్స్‌ను అయోమయానికి గురిచేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల విషయంలో ముందుగానే రిలీజ్ డేట్స్‌ను ప్రకటిస్తున్నారు డైరెక్టర్లు. కానీ ఆ మాట మీద మాత్రం నిలబడే డైరెక్టర్లు చాలా తక్కువే కనిపిస్తున్నారు. షూటింగ్ డిలే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్, ముందు సినిమాల రిజల్ట్, రీషూట్స్… ఇలా కారణాలు ఏవైనా సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ చేయడం ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది.
మిరాయ్ వర్సెస్ ఘాటి…
సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు రానున్న నాలుగు నెలల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే టాలీవుడ్ సినిమాలు ఏవన్నది క్లారిటీ లేకుండా పోయింది. సెప్టెంబర్ 5న తేజా సజ్జా మిరాయ్‌తో పాటు అనుష్క ఘాటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ మిరాయ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 12 లేదా 19న ఈ సినిమా రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు అనుష్క ఘాటి ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ మారింది. సెప్టెంబర్ 5న కూడా ఈ సినిమా థియేటర్లలోకి రావడం అనుమానమేనని అంటున్నారు.
దుల్కర్ సల్మాన్ కాంతను సెప్టెంబర్ 12న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. చెప్పిన డేట్‌కు సినిమా రావడం ఇంపాజిబుల్‌గా కనిపిస్తోంది.
Also Read – Viral: యువతిని అసభ్యంగా తాకిన ఆలయ పూజారి.. వైరల్ గా మారిన వీడియో..
మాస్ జాతర… డైలమా…
రవితేజ మాస్ జాతర మూవీ వినాయకచవితి కానుకగా ఆగస్ట్ 27న రిలీజ్ కావాల్సింది. కానీ వార్ 2 డిజాస్టర్ ఎఫెక్ట్, కార్మికుల సమ్మె కారణంగా ఆగస్ట్ రేసు నుంచి మాస్ జాతర తప్పుకుంది. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇప్పటివరకు ప్రకటించలేదు. అక్టోబర్ 31న రవితేజ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అఖండ 2 పోస్ట్‌పోన్…
సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ ఓజీతో పాటు బాలకృష్ణ అఖండ 2 రిలీజ్ కాబోతున్నాయి. ఈ బాక్సాఫీస్ క్లాష్ నుంచి అఖండ 2 తప్పుకుందని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అఖండ 2 రిలీజ్‌ను డిసెంబర్‌కు వాయిదా వేసినట్లు చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు మేకర్స్ నుంచి మాత్రం పోస్ట్‌పోన్‌కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.
సంక్రాంతికే…
రాజాసాబ్ విషయంలో ఇలాంటి పుకార్లే వినిపిస్తున్నాయి. డిసెంబర్ 5న రావాల్సిన ఈ మూవీ సంక్రాంతికి వాయిదా పడినట్లు చెబుతున్నారు. ఓటీటీతో పాటు డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడి మేరకే ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చినట్లు సమాచారం. చిరంజీవి విశ్వంభర అయితే ఏకంగా ఈ ఏడాది నుంచే తప్పుకుంది. 2026 సమ్మర్‌కు ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరికొన్ని పెద్ద సినిమాల రిలీజ్‌ల విషయంలో ఇలాంటి గందరగోళమే కనిపిస్తుంది.
Also Read – Dog Menace in Telangana: కుక్కల స్వైరవిహారం.. గంటకు 14 మందికి గాట్లు.. ఈ పీడకు పరిష్కారమెన్నడు?


