ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా నగరం’ చిత్రంలో హీరోగా నటించిన శ్రీనటరాజన్ మానసిక స్థితి బాగాలేదనే వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై లోకేష్ కనగరాజ్ ఎక్స్ వేదికగా ఓ నోట్ విడుదల చేశాడు. అతడి కుటుంబసభ్యులు విడుదల చేసిన స్టేట్‌మెంట్‌ను అభిమానులతో పంచుకున్నాడు.
‘శ్రీరామ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్న శ్రేయోభిలాషులు, స్నేహితులకు ఓ విషయం తెలియజేయాలని అనుకుంటున్నాం. అతడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. వారి సూచన మేరకు కొన్నిరోజుల పాటు సామాజిక మాధ్యమాలకు అతడు దూరంగా ఉంటాడు. అతడి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దు. అదేవిధంగా తప్పుడు కథనాలు సృష్టించవద్దు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో వస్తోన్న కథనాలు చూసి కుటుంబం ఎంతో బాధపడుతుంది. త్వరలోనే అతడు కోలుకుని ఎప్పటిలాగే ప్రేక్షకుల్ని అలరిస్తాడు‘ అంటూ ఆ నోట్‌లో పేర్కొన్నాడు.
కాగా శ్రీ నటరాజన్ అసలు పేరు శ్రీరామ్ నటరాజన్. కెరీర్ ఆరంభంలో పలు సీరియల్స్‌లో నటించాడు. ‘వళక్కు ఎన్ 18/9’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా పలు అభ్యంతరకర వీడియోలు షేర్ చేశాడు. దీంతో అతడి మానసిక పరిస్థితి బాగాలేదని వార్తలు వైరల్ అయ్యాయి.
