కొన్ని రోజులుగా ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో పలు విషాదాలు నెలకొన్నాయి. పలువురు సినీ ప్రముఖులు మరణించారు. లెజండరీ దర్శకుడు శ్యామ్ బెనగల్, మలయాళ సీనియర్ నటి మీనా, జాకీర్ హుస్సేన్, బలగం మొగిలయ్య తదితరులు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు సభాపతి(61) అలియాస్ దక్షిణామూర్తి కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో మరణించినట్టు సమాచారం. తమిళంతో పాటు తెలుగు, కన్నడలో సినిమాలు చేశారు. ఈయన మృతి పట్ల ప్రముఖలు సంతాపం తెలియజేశారు.
కాగా దిగ్గజ నటుడు విజయ్ కాంత్ హీరోగా నటించిన భారతన్ మూవీతో సభాపతి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తర్వాత ప్రభుదేవాతో వీఐపీ అనే సినిమా తీశారు. తెలుగులో 2005లో జగపతిబాబు హీరోగా వచ్చిన పందెం సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక తమిళంలో ఆయన తీసిన సుందర పురుషులు మూవీని తెలుగులో సునీల్ హీరోగా అందాల రాముడు సినిమాగా రీమేక్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘అంజి’ సినిమాకు మొదట సభాపతిని దర్శకుడుగా అనుకున్నారు. ఆ తర్వాత అనుకోని కారణాలతో ఆ ప్రాజెక్టు కోడి రామకృష్ణ చేతికి వెళ్ళింది.