ఇటీవల జరిగిన మహాకుంభమేళాలో పూసలు అమ్ముతూ మోనాలిసా(Monalisa) బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఫొటోలు వైరల్ కావడంతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఆమెకు సినిమాల్లో నటించే అవకాశం కూడా వచ్చింది. సనోజ్ మిశ్రా( Sanoj Mishra) అనే డైరెక్టర్ మోనాలిసాకు ఛాన్స్ ఇచ్చిన విషయం విధితమే. ఆమె ప్రధాన పాత్రలో ‘మణిపూర్ ఫైల్స్’ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఆయన మీద లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
సనోజ్ మిశ్రా తనను లైంగికంగా వేధించాడని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి ఢిల్లీలోని నబీ కరీమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ‘టిక్ టాక్ ద్వారా మా ఇద్దరి పరిచయం పెరిగింది. 2021 జూన్ 17న నాకు సనోజ్ మిశ్రా ఫోన్ చేశాడు. ఝాన్సీ రైల్వే స్టేషన్ దగ్గరకు రావాలన్నాడు. చనిపోతాను అని బెదిరించడంతో చివరకు వెళ్లాను. అక్కడకు వెళ్లిన తర్వాత నన్ను హోటల్ రూమ్‌కు తీసుకెళ్లి నాకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆ విషయం బయటకు చెబితే ఫొటోలు, వీడియోలు బయటపెడుతానంటూ బెదిరించాడు. అలా బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు’ అంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు.