Niranjan Reddy Vs Prashant Varma: ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు.. ఇద్దరి మధ్య స్నేహం బావుంటే.. పరిస్థితులు బావుంటాయి. ఏమాత్రం తేడా వచ్చి ఇద్దరూ గొడవ పడితే విబేదాలు బయటకు వస్తాయి. ఇప్పుడు హను మాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డిలను చూసిన వాళ్లు ఇదే అంటున్నారు. గత ఏడాది వీరి కాంబోలో తేజా సజ్జ హీరోగా వచ్చిన హను మాన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించింది. సినిమా కూడా దాదాపు రూ.300 కోట్లను రాబట్టింది. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్‌కు సినిమా చాలా బాగా కనెక్ట్ అయ్యింది.
తర్వాత వీరిద్దరి కాంబోలో అధీర సినిమా రానుందంటూ ఓ గ్లింప్స్ కూడా వచ్చింది. జై హనుమాన్ ఉంటుందని హనుమాన్ సమయంలోనే ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే మధ్య పొరపచ్చాలు రావటంతో విబేదాలు మొదలయ్యాయి. నిరంజన్ రెడ్డితో ప్రశాంత్ వర్మ చేస్తాడనుకున్న సినిమాలు మరో బ్యానర్‌లోకి వెళ్లాయి. అక్కడి వివాదం ముగియలేదు. ఇద్దరూ చాంబర్ బాట పట్టారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు.
Also Read – India vs Australia: టీ20 సిరీస్‌లో భారత్ పుంజుకోగలదా?
ఇంతకీ నిర్మాత నిరంజన్ రెడ్డి ఏమన్నారంటే.. తన బ్యానర్‌లో నాలుగు సినిమాలు చేయటానికి ప్రశాంత్ వర్మ రూ.10.34 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారు. అందులో అధీర, జై హనుమాన్, బ్రహ్మ రాక్షస, మహా కాళి సినిమాలున్నాయి. అలాగే మరో నిర్మాత దగ్గర అక్టోపస్ అనే సినిమాను తీసుకునేలా ఒప్పించి ఆయనకు నిరంజన్ రెడ్డి రూ.10.23 కోట్లు చెల్లించేలా చేశారు. డబ్బులు తీసుకున్న నిర్మాత ఇప్పటి వరకు నిరంజన్‌కు ఎలాంటి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. మరో వైపు ప్రశాంత్ వర్మ తనతో చేయాల్సిన సినిమాలను వేరే బ్యానర్స్‌లో చేస్తుండటంతో నిరంజన్ రెడ్డి ఇప్పుడు చాంబర్లో కంప్లైంట్ చేశాడు.
ప్రశాంత్ వర్మ ముందుగా నిరంజన్ రెడ్డి బ్యానర్‌లో డైరెక్ట్ చేస్తానని ఒప్పుకున్న నాలుగు సినిమాల్లో మహా కాళి, అధీర సినిమాలను ఆయన డైరెక్ట్ చేయటం లేదు. కేవలం కథలను మాత్రమే అందిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలను ఆర్‌కెడి స్టూడియోస్ బ్యానర్ నిర్మిస్తోంది. అలాగే ప్రశాంత్ వర్మ తన దర్శకత్వంలో జై హనుమాన్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో చేస్తున్నారు. మరో వైపు బ్రహ్మ రాక్షస అనే మరో సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో చేస్తున్నారు. ఈ సినిమాలు సెట్స్ పైకి వెళ్లటానికి సిద్ధమవుతున్నాయి. పరిస్థితి చేయి దాటటంతో నిర్మాత నిరంజన్ రెడ్డి చాంబర్ మెట్లు ఎక్కారు.
ప్రశాంత్ వర్మపై నిరంజన్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వటమే కాకుండా, తన వల్ల ఆర్థికంగా నష్టపోయానంటున్నారు. ప్రశాంత్ వర్మ ఇవ్వాల్సిన రూ.20.57 కోట్లు అడ్వాన్స్‌ను 36 % వడ్డీతో తిరిగి ఇవ్వాలని నిర్మాత డిమాండ్ చేస్తున్నారు. వీటి వల్ల తాను కమర్షియల్ చాలా నష్టపోవటంతో లాస్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీ కింద రెండు వందల కోట్లు చెల్లించాలని అంటున్నారు. (అందులో జై హనుమాన్ కోసం రూ.100 కోట్లు). మరి వీరిద్దరి గొడవను చాంబర్ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
Also Read – Kenya: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 21 మంది మృతి, 30 మంది గల్లంతు


