Manchu Manoj| రాచకొండ పోలీస్ కమిషనర్ ఎదుట విచారణకు హాజరైన మంచు మనోజ్ ఈ వివాదంపై విషయాలను సీపీకి వివరించారు. తనపై తప్పు ప్రచారం చేశారని తెలిపారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన మనోజ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అన్న విష్ణు సన్నిహితుడు వినయ్ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు తలెత్తాయని తెలిపారు. ఈ వివాదాన్ని కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. తాను ఆస్తి కోసం ఈ గొడవలు పడటం లేదన్నారు.
శ్రీ విద్యానికేతన్ సంస్థలను అప్పట్లో నాన్న మోహన్ బాబు(Mohan Babu) హైదరాబాద్‌లో పెట్టొచ్చని..కానీ పేద ప్రజలు ఎక్కువగా ఉండే తిరుపతి గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించి అక్కడ పెట్టారని పేర్కొన్నారు. అయితే ఆ ప్రాంత ప్రజల సమస్యలను తన నాన్న వరకు రీచ్ కానివ్వడం లేదన్నారు. ఈ విషయం ఆయనకు తెలియపరచాలని ప్రయత్నిస్తుంటే తనను అడ్డుకుంటున్నారని చెప్పుకొచ్చారు. తిరుపతిలో వినయ్ వ్యవహారశైలి తనకు నచ్చడం లేదన్నారు. ప్రస్తుతం తన అమ్మ ఆస్పత్రిలో లేరని ఇంట్లోనే ఉన్నారని మనోజ్ వెల్లడించారు.