తెలుగు సినిమా తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతీ దేవి ఇక లేరు. 97 సంవత్సరాల సంపూర్ణ జీవితాన్ని గడిపిన ఆమె వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మద్రాసులో 1928 ఆగస్ట్ 28న పార్థసారథి రావు, విశాలాక్షి దంపతులకు జన్మించారు. కేవలం ఆరేళ్ల వయసు నుంచే ఆమె పాటలు పాడటం మొదలుపెట్టారు. 1934లో ఆమె పాడగా గ్రాంఫోన్ కోసం రికార్డ్ చేసిన మొదటి పాట “దొరికే దొరికే నాకు” అనేది.
ఒకప్పటి ప్రఖ్యాత దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య రూపొందించిన ‘సతీ అనసూయ’ చిత్రంతో బాలసరస్వతి బాలనటిగా చిత్రసీమలో అడుగుపెట్టారు. గంగ అనే పాత్రకు గాను ఆమెకు ఇచ్చిన పారితోషికం రూ. 250 అని ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం కింద లెక్క. గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో 1940లో వచ్చిన ‘ఇల్లాలు’ సినిమాతో హీరోయిన్‌గా కూడా ఆమె పరిచయమయ్యారు. అందులో సాలూరి రాజేశ్వరరావు ఆమెకు జోడీ. ఇద్దరూ ఎవరి పాటలు వారు పాడుకున్నారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/siddu-jonnalagadda-womanizer-question-journalism-values/
వెంకటగిరి రాజా నాల్గవ కుమారుడు రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు బహదూర్ ఆమెను వివాహం చేసుకుంటానని ప్రతిపాదించారు. అలా ఆయనతో బాలసరస్వతి వివాహం 1944లో జరిగింది. సూర్యారావు బహదూర్‌కు ఆమె రెండో భార్య. ఆమెకంటే ఆయన వయసులో 19 సంవత్సరాలు పెద్ద. వారికి ఇద్దరు కుమారులు.. వెంకట రాజ గోపాలకృష్ణ సూర్యారావు, వెంకట గోపాలకృష్ణ మహీపతి సూర్యారావు.
1974లో భర్త మృతిచెందాక బాలసరస్వతి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వివాహానంతరం పాడటం ఆపేయమని భర్త సూచించడంతో మనసుకు కష్టం వేసినా, ఆయన మాటకు విలువ ఇచ్చి పాడటం ఆపేశారు. భర్త మృతి చెందాక మాత్రమే మళ్లీ ఆమె అడపాదడపా పాడుతూ వచ్చారు. భర్త కనుక ఆమెను ప్రోత్సహించినట్లయితే, గాయనిగా ఆమె మరింత ఉన్నత స్థాయికి చేరుకొనేవారే. తన జీవిత కాలంలో రెండు వేలకు మించి పాటలు పాడిన బాలసరస్వతి చివరగా పాడిన సినిమా విజయ నిర్మల దర్శకత్వం వహించిన ‘సంఘం చెక్కిన శిల్పాలు’ (1980).


