రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, దర్శకుడు శంకర్ (Shankar) తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్'(Game Changer) మూవీ సంక్రాంతి కానుకగా ఈ నెల 10న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సినిమాని లీక్ చేస్తామంటూ మూవీ యూనిట్‌కి బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులపై తాజాగా చిత్ర బృందం సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా సినిమాపై నెగెటివిటీ సృష్టిస్తున్న కొన్ని ఖాతాలపైనా కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సినిమా విడుదలకు ముందు నిర్మాతలతో పాటు టీమ్‌లోని కొందరు కీలక వ్యక్తులకు వాట్సాప్, సోషల్ మీడియా వేదికగా డబ్బు ఇవ్వాలంటూ బెదిరింపులు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అడిగిన మొత్తాన్ని ఇవ్వకపోతే మూవీని లీక్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేశారని తెలిపారు. మూవీ రిలీజ్‌కు రెండు రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేశారని… సినిమా రిలీజైన రోజే ఆన్‌లైన్‌లో లీక్ చేశారన్నారు. దీని వెనక 45 మందితో కూడిన ముఠా ఉందన్నారు. దీంతో ఈ ముఠా వెనుక ఉన్నదెవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.