Ready to Release: ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద యాక్షన్ సినిమాలదే హవా కనిపిస్తోంది. అనుష్క ఘాటీ, శివకార్తికేయన్ మదరాసితో పాటు బాలీవుడ్ మూవీ భాఘీ 4 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తెలుగులో అనుష్క ఘాటీపైనే ఎక్కువగా అంచనాలు నెలకొన్నాయి. ఘాటీ పోటీనిస్తూ మిగిలిన సినిమాలు ఎంత వరకు బాక్సాఫీస్ వద్ద నిలబడతాయన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తంగా ఈ వారం తెలుగు, హిందీ భాషల్లో కలిపి ఏడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆ సినిమాలు ఏవంటే?
రెండేళ్ల తర్వాత….
ఘాటీ మూవీతో దాదాపు రెండేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది అనుష్క. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఘాటీ ప్రమోషన్స్‌కు అనుష్క దూరంగా ఉంటోంది. అయినా ఈ సినిమాపై హైప్ మాత్రం భారీగానే ఉంది. ఘాటీతో కోలీవుడ్ నటుడు విక్రమ్ ప్రభు హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. బాధితురాలి నుంచి క్రైమ్ వరల్డ్‌కు లెజెండ్‌గా ఓ మహిళ ఎలా మారిందనే పాయింట్‌తో ఘాటి మూవీని క్రిష్ రూపొందించారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, జగపతిబాబు, చైతన్యరావు కీలక పాత్రలు పోషించారు. ఘాటీతో అనుష్కకు హిట్టు దక్కుతుందో లేదో అన్నది ఈ శుక్రవారం డిసైడ్ కానుంది.
లిటిల్‌హార్ట్స్…
నైంటీస్ మిడిల్‌క్లాస్ బయోపిక్ ఫేమ్ మౌళి హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ లిటిల్ హార్ట్స్ ఈ వారమే థియేటర్లలోకి రానుంది. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శివానీ నాగారం హీరోయిన్‌గా నటిస్తోంది. టీజర్స్, ట్రైలర్స్ ఈ చిన్న సినిమా తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాను వంశీ నందిపాటితో కలిసి బన్నీవాస్ రిలీజ్ చేస్తోన్నారు. ఈ సినిమాను నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ నిర్మించారు.
మదరాసి…
శివకార్తికేయన్ మదరాసి మూవీ ఈ శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. శివకార్తికేయన్‌తో పాటు ఏఆర్ మురగదాస్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండటం మదరాసికి ప్లస్సయ్యింది. అమరన్ బ్లాక్‌బస్టర్ తర్వాత శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. స్ట్రెయిట్ మూవీస్ పోటీని తట్టుకొని ఈ డబ్బింగ్ మూవీ ఏ మేరకు తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందో చూడాల్సిందే. ఈ మూడు సినిమాలతో పాటు లవ్ యూ రా అనే చిన్న సినిమా కూడా సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతుంది.
మూడు బాలీవుడ్ సినిమాలు…
ఈ వారం మూడు బాలీవుడ్ సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీ బాఘీ 4 తో పాటు వివేక్ అగ్నిహోత్రి ది బెంగాల్ ఫైల్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. భాఘీ 4లో హర్నాజ్ సంధు హీరోయిన్‌గా నటిస్తోంది. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. బెంగాల్ ఫైల్స్‌లో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలు పోషించారు. వీటితో పాటు తెలుగు డైరెక్టర్ జీ అశోక్ దర్శకత్వం వహించిన ఉఫ్ యే సియాపా కూడా ఈ ఫ్రైడే థియేటర్లలోకి రాబోతుంది.


