Disha Patani: బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్ బరేలీలో శుక్రవారం రోజు జరిగిన ఈ సంఘటన కలకలం రేపుతోంది. సాధువులపై దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఈ కాల్పులకు కారణమని ప్రచారం జరుగుతోంది. ఈ కాల్పుల ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు.
సోదరిని టార్గెట్ చేస్తూ…
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలోని సివిల్ లైన్స్‌లో ఉన్న దిశా పటానీ ఇంటి వెలుపల శుక్రవారం ఉదయం 4.30 గంటల సమయంలో రెండు రౌండ్ల వైమానిక కాల్పులు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీని టార్గెట్ చేస్తూ ఈ కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఖుష్బూ పటానీ ఆర్మీలో చాలా కాలం పనిచేసింది. ప్రస్తుతం ఫిట్‌నెస్ ట్రైనర్‌గా కొనసాగుతోంది. ఇటీవల ఖుష్బూ పటానీ సాధువులను అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆ వివాదాస్పద వ్యాఖ్యల వల్లే ఆమె ఇంటి ముందు కాల్పులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది.
ట్రైలర్ మాత్రమే…
కాల్పులు జరిపింది ఎవరన్నది పోలీసులు వెల్లడించలేదు. కానీ ఈ కాల్పులను తామే జరిపినట్లు వీరేంద్ర చరణ్, మహేంద్ర చరణ్ అనే వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. “సనాతన ధర్మాన్ని కించపరచడానికి ఆమె ప్రయత్నించింది. సాధువులను అవమానిస్తే సహించేదు లేదు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చంపేస్తాం” అంటూ ఖుష్బూ పటానీకి వార్నింగ్ ఇస్తూ వారు తమ పోస్ట్‌లో పేర్కొన్నారు.
తెలుగు సినిమాలతోనే…
కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. క్లూస్ టీమ్ కూడా ఆనవాళ్లు సేకరించినట్లు సమాచారం. తొందరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
దిశా పటానీ సినీ కెరీర్ తెలుగు సినిమాలతోనే మొదలైంది. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లోఫర్‌గా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లో ఎంఎస్ ధోనీ బయోపిక్, భాఘీ2తో పాటు పలు సినిమాలు చేసింది. ప్రభాస్ కల్కి 2898 ఏడీలో హీరోయిన్‌గా నటించింది.
Also Read- Kishkindhapuri Review: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమల ‘కిష్కింధపురి’ మూవీ రివ్యూ


