పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం ఆయన కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముందుగా ‘హరిహర వీరమల్లు'(Hari hara Veera mallu) సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ 8 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ మూవీ మేజర్ పార్ట్‌ని ఇప్పటికే ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన దర్శకత్వం నుంచి తప్పించుకున్నారు. దీంతో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ మిగిలిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. పవన్ కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. “మాట వినాలి” అనే పాటను జనవరి 6వ తేదీ ఉదయం 9 గంటల 6 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ పాటను స్వయంగా పవన్ పాడటం విశేషం. దీంతో ఫ్యాన్స్ ఈ పాట కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే మూవీ యూనిట్ వారికి బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈ పాటను విడుదల చేయడానికి ఇంకాస్త సమయం పడుతుందని తెలిపింది. పాట అత్యుత్తమ వెర్షన్‌ని అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు కొంత సమయం పడుతుందని పేర్కొంది. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని అభిమానుల నిరీక్షణకు తగ్గట్టుగానే పాట ఉంటుందని హామీ ఇచ్చింది.