రాజకీయాల్లో బిజీగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు'(Hari hara Veera mallu) సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ మూవీ మేజర్ పార్ట్‌ని ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన దర్శకత్వం నుంచి తప్పించుకున్నారు. దీంతో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ మిగిలిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. పవన్ కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, పాటలు ఆకట్టుకున్నాయి. ఈ నెల 28న ఈ సినిమా విడుదల చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే షూటింగ్ పూర్తికాకపోవడంతో సినిమా విడుదలను వాయిదా వేసింది. హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ కొత్త విడుదల తేదీని ప్రకటించింది. మే 9న ఈ మూవీ తొలి భాగం విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ పంచుకుంది. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, సునీల్ గుర్రపు స్వారీ చేస్తున్నట్లుగా పోస్టర్‌లో కనిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. సూర్య మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.