పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరిహర వీరమల్లు'(HariHara VeeraMallu). ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉండటంలో ఎన్నోసార్లు వాయిదాపడిన ఈ మూవీ.. ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. జూన్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్ విడుదల చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
జాగర్లమూడి క్రిష్, జ్యోతికృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్, నర్గిస్ ఫఖ్రీ నటిస్తున్నారు. అలాగే బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, నోరా ఫతేహి, జిషు సేన్ గుప్తా వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కథ 17వ శతాబ్దం నాటి మొఘల్ రాజవంశం, కుతుబ్ షాహీల చారిత్రక నేపథ్యాన్ని ఆధారంగా తెరకెక్కనుంది. మూవీలో పవన్ కళ్యాణ్ ఒక వీరుడిగా, వజ్రాల దొంగగా కనిపించనున్నాడు. ఈ మూవీని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.