Sharwanand: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో శర్వానంద్. గతకొంతకాలంగా ఈ యంగ్ హీరోకి హిట్స్ దక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఓమీ (OMI) అనే పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను శర్వా ప్రకటించారు. ఇది కేవలం బ్రాండ్ కాదు, భవిష్యత్తు తరాలకు సంబంధించి ఒక విజన్‌కి ఆరంభమని ఆయన తెలిపారు. ఈ మధ్య స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా కొత్త టాలెంట్‌ను వెలికి తీసేందుకు నిర్మాణ సంస్థలను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కిరణ్ అబ్బవరం కూడా ఓ నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించారు.
శర్వా విషయానికి వస్తే.. మంచి ఉద్దేశ్యం, ఆలోచనలు, బాధ్యతతో కొత్త చాప్టర్‌ను మొదలుపెడుతున్నాను.. క్రియేటివిటీ, యూనిటీ, సస్టైనబిలిటీతో ఒరిజినల్ కథలను అందిస్తాను అని శర్వా తెలిపారు. ఇప్పటివరకు ఎవరూ చెప్పని మంచి కథలను ఈ సంస్థ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను.. అని శర్వానంద్ స్పష్టం చేశారు.
నటీ నటులు, క్రియేటివ్ మైండ్స్‌ను కలిపే అద్భుతమైన వేదికగా, కేవలం సినిమాలనే కాకుండా ఆరోగ్యం, ప్రకృతికి దగ్గరగా ఉండే జీవనాన్ని ప్రోత్సహించే ఓ గొప్ప సంస్థగా ఓమీని తీర్చిదిద్దుతున్నట్టుగా శర్వానంద్ చెప్పారు. ఇక ఈ సంస్థను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదగా ప్రారంభించారు శర్వానంద్.
శర్వానంద్ హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వాటిలో ఒకటి టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది రూపొందిస్తున్న భోగి. ఇది శర్వా కెరీర్ లో 38వ సినిమా. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. 1960 లలో సాగే కథగా సంపత్ నంది ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలాగే, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నారీ నారీ నడుమ మురారి టైటిల్ తో కామెడి అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా మరో సినిమా రూపొందుతోంది. ఇక నిర్మాతగా శర్వానంద్ ఎలాంటి సినిమాలను ప్రకటిస్తారో చూడాలి.
Also Read- Kotha Lokah Chapter 1: ‘కొత్త లోక చాప్టర్ 1’ సెన్సేషన్.. 13 రోజుల్లోనే మరో అరుదైన రికార్డ్ సొంతం!


