I Bomma : సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పైరసీ ఒకటి. పైరసీకి అడ్డుకట్ట వేయడానికి సినీ పరిశ్రమ చాలా ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉంది. ముఖ్యంగా పైరసీ వెబ్‌సైట్ ఐ బొమ్మ కారణంగా ఇండస్ట్రీకి వందల కోట్లలో నష్టం కలుగుతోంది. ఐ బొమ్మకు పోలీసులకు పెద్ద షాక్ ఇచ్చారు. ఈ పైరసీ యాప్ అడ్మిన్‌లలో ఒకరైన ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతడిని కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. కరేబియన్ దీవుల్లో స్థిరపడిన ఇమ్మడి రవి అక్కడి నుంచే ఈ వెబ్‌సైట్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు సమాచారం. డిజిటల్ నెట్‌వర్క్‌లు, సర్వర్లు ఉపయోగిస్తూ కొత్త సినిమాలను పైరసీ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. కొన్నాళ్లుగా అతడి కదలికలపై దృష్టిపెట్టిన పోలీసులు హైదరాబాద్ వచ్చాడనే పక్కా సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇమ్మడి రవి అకౌంట్‌లో ఉన్న మూడు కోట్ల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేసినట్లు సమాచారం. ఐ బొమ్మ ద్వారానే ఈ డబ్బులు వచ్చాయా? అన్నదానిపై విచారణను మొదలుపెట్టినట్లు తెలిసింది. ఐ బొమ్మ వెబ్‌సైట్ నిర్వహణలో రవితో పాటు మరికొందరు పెద్దలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రవి ద్వారా వారి వివరాలను సేకరించే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నట్లు తెలిసింది. రవి అరెస్ట్‌తో ఐ బొమ్మ కార్యకలాపాలకు చెక్ పడే అవకాశం ఉందని అంటున్నారు.
ఇటీవలే బొమ్మ నిర్వహకులు పోలీసులతో పాటు సినీ పరిశ్రమకు వార్నింగ్ ఇచ్చారు. మీరు ఐ బొమ్మ మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ చేయాలో అక్కడ చేస్తాం అంటూ నోట్ రిలీజ్ చేశారు. మీ యాక్షన్‌కు నా రియాక్షన్ ఉంటుందని అన్నారు. సినిమా బడ్జెట్‌లో ఎక్కువ శాతం రెమ్యూనరేషన్లకే ఖర్చు చేయాల్సివస్తుందని, హీరోలకు అంత రెమ్యూనరేషన్ అవసరమా అంటూ ఈ నోట్‌లో ఐ బొమ్మ నిర్వహకులు పేర్కొన్నారు. వార్నింగ్ ఇచ్చిన కొద్ది రోజులకే ఆడ్మిన్‌ను అరెస్ట్ చేసి ఐ బొమ్మకు పెద్ద షాకిచ్చారు పోలీసులు.
ఐ బొమ్మతో పాటు మరికొన్ని పైరసీ సైట్స్‌కు సంబంధించిన కీలక సూత్రధారులను ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాల పైరసీకి అడ్డుకట్టవేశారు. రానున్న రోజుల్లో మరికొన్ని సినిమా పైరసీలకు సంబంధించి మరికొంత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


