Ram Gopal Varma: తాను ఎక్కడికీ పారిపోలేదని వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి స్పష్టంచేశారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవీ(RGV) మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా పోలీసులు తనును అరెస్ట్ చేయడానికి వచ్చామని ఎక్కడ చెప్పలేదని.. మీడియానే అరెస్టు, పరారీ అంటూ ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు. ఏదో జరిగిపోయిందని కొందరు ఫోన్ చేసి సానుభూతి తెలియజేస్తున్నారని.. అదంతా నచ్చకపోవడంతోనే స్విచ్ఛాఫ్ చేశానని ఆర్జీవీ వివరించారు. తప్పు చేస్తే జైలుకు వెళ్తానని..అక్కడే సినిమా కథలు రాసుకుంటానని చెప్పుకొచ్చారు.
అలాగే గతేడాది అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఓ టూరిస్టులాగా ఫొటో తీసుకున్నానని తెలిపారు.. ఆయన స్థానంలో జగన్, హిట్లర్, గాంధీ ఉన్నా అలాగే సెల్ఫీ తీసుకునేవాడినని పేర్కొన్నారు. అందులో రెచ్చగొట్టడం, హేళన చేయడం ఏముంది అని వ్యాఖ్యానించారు. కాగా వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆర్జీవీపై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇవాళ్టికి వాయిదా వేసింది.