Dude Movie: టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మరోసారి షాకిచ్చారు. అనుమతి లేకుండా డ్యూడ్ సినిమాలో తన పాటను వాడారంటూ హీరో ప్రదీప్ రంగనాథన్‌తో పాటు మైత్రీ మూవీ మేకర్స్, సోనీ మ్యూజిక్‌కు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపించారు. డ్యూడ్ సినిమాలోని కరుతమచ్చన్ పాట తనదేనంటూ ఇళయరాజా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒరిజినల్‌గా ఈ సాంగ్ తాను కంపోజ్ చేసిందని, ముందస్తుగా తన అనుమతి తీసుకోకుండా డ్యూడ్ సినిమాలో మేకర్స్ ఈ పాటను ఉపయోగించారంటూ ఇళయరాజా కంప్లైంట్ ఇచ్చాడట. మైత్రీ మూవీ మేకర్స్‌పై ఇళయరాజా కేసు పెట్టడం ఇది రెండోసారి. అజిత్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీతోనే మైత్రీ మూవీ మేకర్స్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఇళయరాజా కంపోజ్ చేసిన తమిళ సూపర్ హిట్ సాంగ్స్‌ను మేకర్స్ రీమిక్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై కాపీరైట్ ఉల్లంఘన కేసు పెట్టారు ఇళయరాజా.
ఈ వివాదంలో కోర్టు ఇళయరాజాకే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా స్క్రీనింగ్‌ను నిలిపివేయాలని తీర్పు ఇచ్చింది. అప్పటికే థియేటర్లలో నుంచి సినిమా వెళ్లిపోవడంతో నిర్మాతలు సేఫయ్యారు. కానీ ఓటీటీలో నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ ని తొలగించారు. ఈ తీర్పుపై మైత్రీ మూవీ మేకర్స్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కాపీరైట్ ఉల్లంఘన కేసు ప్రస్తుతం కోర్టులోనే ఉంది. ఈ వివాదం సమసిపోకముందే మరోసారి మైత్రీ మూవీ మేకర్స్‌పై ఇళయరాజా కేసు పెట్టడం టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ నాట ఆసక్తికరంగా మారింది. గుడ్ బ్యాడ్ అగ్లీ తరహాలోనే డ్యూడ్ సినిమా స్క్రీనింగ్‌ను కూడా నిలిపివేయాలంటూ కోర్టు తీర్పు ఇస్తే మాత్రం మైత్రీ మూవీ మేకర్స్‌కు గట్టి షాక్ తగిలే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read – Sharwa: సెట్ అయిన క్రేజీ కాంబో, శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్!
దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన డ్యూడ్ తెలుగుతో పాటు తమిళంలో భారీగా వసూళ్లను రాబడుతోంది. ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 80 కోట్ల వరకు వసూళ్లను దక్కించుకుంది. బుధవారం నాటితో ఈ మూవీ వంద కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
డ్యూడ్ మూవీలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ రొమాంటిక్ కామెడీ సినిమాతో కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. డ్యూడ్‌తో హీరోగా తెలుగు, తమిళ భాషల్లో హ్యాట్రిక్ హిట్‌ను అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. డ్యూడ్ కంటే ముందు అతడు హీరోగా నటించిన లవ్‌టుడే, డ్రాగన్ నిర్మాతలకు లాభాల పంటను పండించాయి.
Also Read – IND vs AUS: రేపు అడిలైడ్ లో రెండో వన్డే.. ఈ మైదానంలో భయంకరమైన రికార్డు కలిగి ఉన్న రో-కో?


