Avatar 3 Trailer: హాలీవుడ్ దర్శకుల్లో టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ (James Cameron) సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల్లో అపారమైన క్రేజ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్’ సినిమా ప్రపంచ సినీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా తొలి భాగంలో పండోర అనే గ్రహాన్ని అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఆ తర్వాత వచ్చిన రెండో భాగం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ తో మరోసారి సరికొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ‘అవతార్ 3’తో సందడి చేయటానికి సిద్ధమయ్యారు. ఈ మూడో భాగానికి ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీ డిసెంబర్ 19న థియేటర్స్‌లో సందడి చేయనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ నేపథ్యంలో మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. ఇది తెలుగులో కూడా విడుదల కానుండడం విశేషం. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ అంచనాలు మరింత పెరిగాయి. ప్రతి ఫ్రేమ్ విజువల్ వండర్‌గా ఆకట్టుకుంటోంది. డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మాయాజాలం కట్టిపడేస్తుంది. ట్రైలర్ ఈ రేంజ్లో ఉంటే సినిమా నెక్ట్స్ రేంజ్‌లో ఉంటుందనటంలో సందేహం లేదు. ఈసారి పండోర గ్రహవాసులు ఎవరితో.. ఎందుకు యుద్ధం చేస్తారనేది అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది.
‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ 2025 డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా 160కి పైగా భాషలలో గ్రాండ్‌గా విడుదల కానుండటం విశేషం. ‘అవతార్’ సిరీస్‌లో రెండో భాగంగా వచ్చిన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ లో నటించిన కేట్ విన్స్‌లెట్ పోషించిన రోనాల్ పాత్రను మూడో భాగమైన ‘అవతార్ 3’ లో మరింత ఆసక్తికరంగా మలిచారని చిత్రబృందం ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ సిరీస్‌లో రాబోతున్న ‘అవతార్ 4’ చిత్రాన్ని 2029 లో, ‘అవతార్ 5’ ను 2031 డిసెంబర్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
అవతార్ సిరీస్ చిత్రీకరణను జేమ్స్ కామెరూన్ 2006లో ప్రారంభించాడు. అంటే దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన ఈ సీక్వెల్స్ పైనే వర్క్ చేస్తుండటం విశేషం. ఈ ఇరవై ఏళ్లలో ఇప్పటి వరకు రెండు భాగాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మూడో భాగం డిసెంబర్ 19న రిలీజ్ కానుంది. పంచ భూతాలను ఆధారంగా చేసుకుని జేమ్స్ కామెరూన్ అవతార్ సిరీస్‌ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.


