జయసుధ అసలు పేరు సుజాత. సినిమాల్లోకి వచ్చాక తన పేరు జయసుధగా మారింది. మనలో చాలామందికి ఆమె రెండో భర్త నితిన్ కపూర్ గురించి తెలుసు కానీ, మొదటి భర్త గురించి తెలిసినవాళ్లు తక్కువమంది. సీనియర్ ప్రొడ్యూసర్ వడ్డే రమేశ్ బావమరిది అయిన కాకర్లపూడి రాజేంద్రప్రసాద్‌తో ఆమె వివాహం 1982 మొదట్లో జరిగింది. అయితే ఆ వైవాహిక బంధం ఎక్కువ కాలం సాగలేదు. కేవలం నెలల వ్యవధిలోనే వాళ్లు విడాకులు తీసుకున్నారు. భర్త పెట్టే బాధలు పడలేకనే ఆ బంధాన్ని జయసుధ తెంచేసుకున్నారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. తిరిగి మూడేళ్లకే ఆమె 1985లో నితిన్ కపూర్‌ను రెండో వివాహం చేసుకున్నారు. వాళ్ల బంధం నితిన్ ఇటీవల మృతి చెందేవరకు కొనసాగింది. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు.
సాధారణంగా హీరోయిన్లు పెళ్లి చేసుకున్నాక వాళ్ల కెరీర్ అంతటితో ఆగిపోతుంటుంది. మునుపటిలా వాళ్లకు హీరోయిన్ అవకాశాలు రావడం అరుదు. కానీ జయసుధకు మాత్రం మొదటి పెళ్లి జరిగిన తర్వాత కూడా హీరోయిన్ ఆఫర్లు తగ్గకపోవడం విశేషంగా చెప్పుకోవాలి. 1982 నుంచి 1985 మధ్య కాలంలోనే ఆమె హీరోయిన్‌గా 50కి పైగా సినిమాల్లో నటించారంటే, ఆమెకు ఆ రోజుల్లో ఎలాంటి డిమాండ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
పెళ్లి తర్వాతనే కృష్ణ సరసన తొలిసారిగా ‘డాక్టర్ సినీయాక్టర్’ సినిమాలో నటించారు జయసుధ. అలాగే చిరంజీవి జోడీగా తొలిగా ‘మగధీరుడు’ సినిమాలో నటించారు. అదివరకు ‘ఇది కథ కాదు’ సినిమాలో కలిసి నటించినా అందులో వాళ్లను జోడీ అనలేం. పెళ్లి తర్వాతనే ఆమెకు ‘మేఘ సందేశం’ లాంటి సినిమా వచ్చింది. పెళ్లికీ, నట జీవితానికీ ఎలాంటి సంబంధం లేదని, ఉత్తమ నటనను ప్రేక్షకులు ఎప్పుడైనా ఆదరిస్తారనేందుకు జయసుధ కెరీర్ బలమైన నిదర్శనం. అందుకే ఆమెను సహజనటి అన్నారు.
Also Read: http://Rajinikanth: ఆ సినిమా తర్వాత రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై!
కొంతమంది హీరోయిన్లు హీరో పక్కన ఓ అలంకారంగానే పరిమితం అవుతారు. కానీ జయసుధ అలా కాదు. 1975లో వచ్చిన ‘లక్ష్మణ రేఖ’ సినిమాతో ఆమె హీరోయిన్ అయ్యారు. అంటే హీరోయిన్‌గా ఆమె వయసు 50 ఏళ్లు. ఆ తర్వాత జ్యోతి, ఆమె కథ, మల్లెపూవు, ప్రేమలేఖలు, ఇది కథ కాదు, శివరంజని, ప్రేమాభిషేకం, పక్కింటి అమ్మాయి, త్రిశూలం, గృహప్రవేశం, మేఘసందేశం, ధర్మాత్ముడు, పల్నాటి సింహం, ఏడడుగుల బంధం, మధుర స్వప్నం, ఆది దంపతులు, కాంచన సీత, కలికాలం లాంటి ఎన్నో చిత్రాల్లో ఉత్తమ పాత్రలు పోషించి అత్యుత్తమ నటిగా అందరి అభిమానాన్ని పొందారు.
ఆ రోజుల్లో జయసుధ నటన కోసమే సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు ఉండేవారంటే అతిశయోక్తి కాదు. ‘మేఘసందేశం’ సినిమా కాలం నాటికి ఆమెకు 217 అభిమాన సంఘాలు ఉండేవంటే నమ్మశక్యం కాదు. కానీ అది నిజం. వాటిలో ఎక్కువగా ఆడవాళ్లు నిర్వహించేవి ఉండటం ఇంకో విశేషం. ఆమెకు విపరీతంగా ఉత్తరాలు వచ్చేవి. తెలుగు, తమిళ, ఇంగ్లీషు భాషల్లో ఆ ఉత్తరాలు ఉండేవి.
Also Read: http://Jaanvi Swaroop: హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న మహేష్‌బాబు మేనకోడలు
జయసుధకు తెలుగు చదవడం రాదు. మద్రాసులో పుట్టి పెరగడం వల్ల తమిళం చదవడం వచ్చు. అందువల్ల తెలుగులో వచ్చే ఉత్తరాలను అసిస్టెంట్ చేత చదివించుకొనేవారు జయసుధ. వాటికి సమాధానాలు కూడా ఆమె రాయించేవాళ్లు. ఆమెకు వచ్చే ఉత్తరాల్లో లవ్ లెటర్స్ సంఖ్య తక్కువేమీ కాదు. పెళ్లైన తర్వాత కూడా అభిమానుల నుంచి ఆమె అందుకున్న ప్రేమలేఖలెన్నో! కొంతమంది ఆమెకు పెళ్లైన సంగతి తెలియక, పెళ్లి చేసుకుందామని రాసేవాళ్లు. వాటిని చదువుకొని ఆమె నవ్వుకొనేవాళ్లు.
ఒకప్పుడు నటిగా మార్కెట్ ఉన్నంతకాలమే నటించి, ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పాలని ఆమె భావించారు. కానీ ఆ అవకాశం చిత్రసీమ ఆమెకు ఇవ్వలేదు. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గాక కూడా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఆమెను అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ పాత్రల్లోనూ ఆమెను జనం ఆదరిస్తూనే వచ్చారు, ఇప్పటికీ ఆదరిస్తూనే ఉన్నారు.
– వనమాలి


