Jr Ntr Video: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వార్ 2’. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హృతిక్ రోషన్ హాజరు కావటం విశేషం. ఈవెంట్‌లో అభిమానులను ఉద్దేశించి పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ ఒక వీడియోను విడుదల చేశారు. ఇంతకీ ఎన్టీఆర్ రిలీజ్ చేసిన సదరు వీడియోలో తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మరియు పోలీసు శాఖకు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయినందుకు క్షమాపణలు కోరారు.
‘వార్ 2’ ఈవెంట్ విజయవంతం…
వార్ 2 ప్రీ రిలీజ్ వేడుక యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగింది, దీనికి తారక్, హృతిక్ లతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్. నాగవంశీ వంటి ప్రముఖులు హాజరయ్యారు. వారి ప్రసంగాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ తన ప్రసంగంలో హృతిక్ రోషన్, దర్శకుడు అయాన్ ముఖర్జీ, నిర్మాత ఆదిత్య చోప్రా మరియు ఈవెంట్‌ను ఏర్పాటు చేసిన సూర్యదేవర నాగవంశీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
పన్నెండేళ్ల తర్వాత బహిరంగ కార్యక్రమం..
‘వార్ 2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జూనియర్ ఎన్టీఆర్‌కు చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆయన ఒక బహిరంగ ప్రదేశంలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యారు. 2013లో ‘బాద్ షా’ ఈవెంట్ లో జరిగిన తొక్కిసలాటలో ఒక అభిమాని మరణించినప్పటి నుండి తారక్ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ ‘వార్ 2’ ఈవెంట్‌కు నాగవంశీ తనను బలవంతంగా తీసుకువచ్చారని ఎన్టీఆర్ పేర్కొన్నారు. హీరోగా 25 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ శుభ తరుణంలో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకోవడానికి వచ్చానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
My sincere thanks to the Government of Telangana and the honourable CM Shri @revanth_anumula garu, as well as the Telangana Police Department @TelanganaCOPs for their support in making the #War2 pre-release event a grand success. pic.twitter.com/krKp8xZejS
— Jr NTR (@tarak9999) August 10, 2025
ఎన్టీఆర్ క్షమాపణలు.. కృతజ్ఞతలు..
ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో స్టేజ్ మీద అందరి గురించి మాట్లాడిన ఎన్టీఆర్, ఈ భారీ కార్యక్రమ నిర్వహణకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించడానికి సహాయం చేసిన పోలీసు విభాగానికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయారు. ఈ పొరపాటును గుర్తించి, తారక్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ‘‘వార్ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేయడంలో సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అలాగే తెలంగాణ పోలీస్ శాఖకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. తన 25 సంవత్సరాల సినీ ప్రయాణపు ఆనందంలో ఈ పొరపాటు జరిగిందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి, హైదరాబాద్ పోలీసులకు, మరియు యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను అని ఎన్టీఆర్ తన వీడియోలో పేర్కొన్నారు. వారు సహాయ సహకారాలు అందించడమే కాకుండా, అభిమానులను ఎంతో బాధ్యతగా చూసుకొని వారి ఆనందానికి కారణమయ్యారని ఆయన మనస్ఫూర్తిగా అన్నారు.


