ప్రముఖ నటుడు కమల్ హాసన్(Kamal Haasan) నటించిన ‘థగ్ లైఫ్’ చిత్రం కర్ణాటకలో విడుదల కావడం లేదు. ఈమేరకు కమల్ తరపు న్యాయవాది కర్ణాటకు హైకోర్టుకు తెలిపారు. ఇటీవల జరిగిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. దీంతో ఆయన వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు, రాజకీయ పార్టీలతో పాటు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) కూడా తీవ్రంగా స్పందించాయి. కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించాయి.
కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ కూడా ఇదే ప్రకటన చేయడంతో కమల్ హాసన్ కోర్టుకెక్కారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. క్షమాపణలు చెప్పాలని కమల్‌కు సూచించింది. అయితే విచారణ అనంతరం కమల్ హాసన్ కేఎఫ్‌సీసీకి ఒక లేఖ రాశారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అందులో పేర్కొన్నారు. కానీ ఈ లేఖలో ఎక్కడా క్షమాపణ చెప్పకపోవడం గమనార్హం. మరోసారి విచారణ సందర్భంగా కమల్ రాసిన లేఖను ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. కమల్ వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని, కన్నడ భాషను కించపరిచే ఉద్దేశం లేదని వాదించారు. అలాంటప్పుడు క్షమాపణ చెప్పి వివాదాన్ని ముగించవచ్చు కదా అని న్యాయస్థానం ప్రశ్నించింది.
దీనికి కమల్ న్యాయవాది బదులిస్తూ.. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే కర్ణాటకలో తన సినిమాను విడుదల చేయరు అని కోర్టుకు విన్నవించారు. అనంతరం కేఎఫ్‌సీసీతో సంప్రదింపులు జరిపేందుకు కొంత సమయం కావాలని కోరగా.. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.


