అభిమాని హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్(Darshan) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల పాటు జైలు జీవితం గడిపిన ఆయన అనారోగ్యం దృష్ట్యా గతేడాది డిసెంబర్‌లో బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా ఆయన అభిమానులకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఫిబ్రవరి 16న తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.
కష్ట సమయాల్లో మీ ప్రేమ తనలో ధైర్యాన్ని నింపిందని.. మిమ్మల్యి వ్యక్తిగతం కలిసి కృతజ్ఞతలు తెలపాలని ఉందన్నారు. కానీ తీవ్రమైన వెన్నునొప్పి, అనారోగ్య సమస్యల కారణంగా ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వచ్చి మీ అందరినీ కలుస్తానని వెల్లడించారు. సోషల్‌మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారడంతో కొన్ని గంటల్లోనే నాలుగు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. గెట్ వెల్ సూన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా అభిమాని రేణుకాస్వామి హత్య కేసు కర్ణాటకలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. చిత్రహింసలకు గురి చేసి అతడిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్శన్, నటి పవిత్రగౌడ సహా 15 మందిని అరెస్టు చేశారు. తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్న దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.