మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) మూవీ ప్రీమియర్ వేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. ప్రివ్యూ సందర్భంగా మోహన్‌బాబు, మంచు విష్ణు నడుచుకుంటూ వస్తున్నారంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ప్రచారాన్ని మూవీ యూనిట్ తీవ్రంగా ఖండించింది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘మార్చి 31న ‘కన్నప్ప’ ప్రీమియర్ వేశారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. వీఎఫ్‌ఎక్స్ విభాగానికి సంబంధించి 15 నిమిషాల ఫుటేజ్ నాణ్యతను సమీక్షించాం. ‘కన్నప్ప’ ఫస్ట్ కాపీని సిద్ధం చేసే పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ సినిమా విస్తృతమైన వీఎఫ్‌ఎక్స్ పరిధి కలిగి ఉండటం, ప్రతి ఫ్రేమ్ సమగ్రంగా తీర్చిదిద్దుతుండటంతో మరింత సమయం అవసరమైంది. అభిమానులు, మీడియా ధ్రువీకరించని ఇలాంటి వార్తలు, సమాచారాన్ని నమ్మొద్దు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. ‘కన్నప్ప’ టీమ్ కష్టాన్ని అర్థం చేసుకుంటూ సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు’’అని పేర్కొంది.
కాగా ఏప్రిల్ 25న సినిమాను విడుదల చేయాలని భావించినా వీఎఫ్‌ఎక్స్ పనుల ఆలస్యం కారణంగా మూవీని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని విష్ణు తెలిపారు.