Kantara: రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’ సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. అక్టోబర్ 2న రిలీజైన ఈ చిత్రం, కేవలం మూడు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ ఏడాది 800 కోట్లు కలెక్ట్ చేసిన రెండవ భారతీయ సినిమాగా కాంతారా చాప్టర్ 1 రికార్డు సృష్టించింది. అయితే, సినిమా ఇంకా చాలా థియేటర్లలో బాగా నడుస్తున్న సమయంలో, కేవలం నాలుగు వారాలకే ”అక్టోబర్ 31న” అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది.
‘కాంతార చాప్టర్ 1’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాకు 4 వారాల గ్యాప్ మాత్రమే ఇవ్వడం వల్ల, ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోతుంది. ‘పుష్ప 2’, ‘కల్కి’ లాంటి పెద్ద సినిమాలు థియేటర్లలో కనీసం ఎనిమిది వారాలు నడవాలని డిమాండ్ చేస్తుంటారు. ఎందుకంటే, తక్కువ గ్యాప్‌తో ఓటీటీకి ఇస్తే, జనాలు ‘ఇంకా కొన్ని రోజుల్లో టీవీలో చూద్దాంలే’ అని థియేటర్లకు రావడం మానేస్తారు. దీని వల్ల థియేటర్లకు రావాల్సిన కలెక్షన్లు చాలా వరకు తగ్గిపోతాయి.
‘కాంతార చాప్టర్ 1’ విషయంలో కూడా అదే జరుగుతుంది. సినిమా ఇంకా బాగా నడుస్తున్నా, నాలుగు వారాలకే ఓటీటీకి వస్తే, థియేటర్ రెవెన్యూ మీద దెబ్బ పడుతుంది అనే చెప్పాలి. అయితే, సినిమా నిర్మాతలు ఓటీటీ కంపెనీలతో భారీ డీల్ కుదుర్చుకున్నారు కాబట్టి, ఆ ఒప్పందం ప్రకారం ఇంత త్వరగా ఓటీటీలోకి ఇవ్వక తప్పడం లేదు. థియేటర్ల వ్యవస్థ నిలబడాలంటే మాత్రం, పెద్ద సినిమాలు కచ్చితంగా 8 వారాల గ్యాప్‌ను పాటించడం చాలా అవసరం అని సినీ వర్గాల టాక్.


