Kantara Chapter 1 Movie Collection రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ‘కాంతార: చాప్టర్ 1’ మూవీ రెండో వారం సైతం బాక్సాఫీస్ దగ్గర హవా కొనసాగిస్తోంది. కేవలం దక్షిణాదినే కాకుండా హిందీ బెల్ట్‌లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుండటం గమనార్హం. ఈ వారం థియేటర్లలో కొన్ని సినిమాలు విడుదలైనా, ఆడియెన్స్ ఫస్ట్ చాయిస్ మాత్రం ‘కాంతర చాప్టర్ 1’. ఈ వీకెండ్ ఒరిజినల్ కన్నడ వెర్షన్‌తో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్ సైతం బాక్సాఫీస్ దగ్గర మెరుగైన కలెక్షన్‌ను సాధించగా, హిందీలోనూ ఊహించిన దానికి మించి వసూళ్లు రాబట్టింది.
తెలుగులో శశివదనే, కానిస్టేబుల్, అరి, మటన్ సూప్.. లాంటి నాలుగు సినిమాలు కొత్తగా రిలీజైనా వాటి ప్రభావం నామమాత్రమే. వీటిలో ఏ ఒక్కటీ కూడా ‘కాంతార: చాప్టర్ 1’ ముందు నిలవలేకపోయాయి. మిగతా భాషల్లోనూ ఇదే స్థితి. అన్ని రకాల సెంటర్లలోనూ రిషబ్ శెట్టి మూవీ వీకెండ్‌లో టాప్ గ్రాసర్‌గా పెర్ఫార్మ్ చేసింది.
ఇక ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతోన్న పవన్ కల్యాణ్ సినిమా ‘ఓజీ’, తేజా సజ్జా మూవీ ‘మిరాయ్’ ఫర్వాలేదనిపించే స్థాయిలో కలెక్షన్లను సాధించాయి. కాకపోతే వాటి స్క్రీన్ల సంఖ్య పరిమితమే. కొత్త క్రేజీ మూవీస్ ఏవీ లేకపోవడం ‘కాంతారా: చాప్టర్ 1’కు కలిసొచ్చి, ఈ వీకెండ్‌లోనూ నంబర్ వన్ పొజిషన్‌లో నిలుచుంది.
అక్టోబర్ 16 నుంచి వరుసగా సినిమా విడుదలలు ఉండటం వల్ల అప్పటి నుంచి ‘కాంతార’కు స్క్రీన్ కౌంట్ క్రమేపీ తగ్గనుంది. తెలుగులో మిత్రమండలి, డ్యూడ్, తెలుసు కదా, కె-ర్యాంప్ ఈ వారంలో విడుదలవుతున్నాయి. వీటి బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ పై ‘కాంతార చాప్టర్ 1’ తెలుగు వెర్షన్ కలెక్షన్ చివరాఖరుకి ఎక్కడ ముగుస్తుందనేది ఆధారపడి ఉంది. రుక్మిణి వసంత్ నాయికగా నటించిన ఈ మూవీలో జయరాం, గుల్షన్ దేవయ్య కీలక పాత్రధారులు.


