Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభKCR condolence: కైకాల మృతికి సీఎం కేసీఆర్ సంతాపం, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

KCR condolence: కైకాల మృతికి సీఎం కేసీఆర్ సంతాపం, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా,మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం గుర్తుచేసుకున్నారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరనిలోటని సీఎం కేసిఆర్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
నవరస నట సార్వభౌమునిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కైకాల అనేక అవార్డులు అందుకున్నారని, తెలుగు ప్రజలు గర్వించదగ్గ విలక్షణ నటుడుగా, లోక్ సభ సభ్యునిగా దివంగత కైకాల సత్యనారాయణ చేసిన కళాసేవ, ప్రజా సేవ గొప్పదని సీఎం అన్నారు. కైకాలతో తనకున్న అనుబంధాన్ని సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు.
సినీ నటుడు మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ చేసిన సేవలకు గౌరవంగా, ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం కెసిఆర్ ఆదేశించారు.

- Advertisement -

కాగా… బంజారా హిల్స్ లోని కైకాల నివాసానికి వెల్లిన సిఎం కేసీఆర్ సినీనటుడు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి పుష్పాంజలి ఘటించారు. వారి కుమారులను కూతుల్లను కుటుంబ సభ్యులను సిఎం ఓదార్చారు. వారికి ధైర్యవచనాలు చెప్పి కాసేపు పరామర్శించారు. అనంతరం అక్కడే వున్న మీడియా ముందుకు వచ్చి నటుడుగా ఎంపీ గా కైకాల తో తనకున్న అనుబంధాన్ని సిఎం స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారు మాట్లాడుతూ… ‘‘ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గారు గొప్ప వ్యక్తి. ఈరోజు వారు మరణించడం చాలా బాధాకరం. సినీ హీరోలతో పోటీపడుతూ చాలా అద్భుతంగా నటించే వారాయన. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో నటించి, అద్భుతమైన పేరు తెచ్చుకున్న వ్యక్తి. నేను కొంతకాలం వారితో కలిసి పనిచేయడం కూడా జరిగింది. ఆ కాలంలో వారితో కొన్ని అనుభవాలను కూడా పంచుకున్నాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ సీనియర్ నటుడు కైకాల గారిని కోల్పోవడం బాధాకరం..’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News