Mammootty – Bramayugam: మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘భ్రమయుగం’ గతేడాది మలయాళంలో వచ్చిన గొప్ప చిత్రాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ చిత్రం.. తాజాగా 55వ కేరళ రాష్ట్ర సినిమా అవార్డుల్లో సత్తా చాటింది. నాలుగు ప్రతిష్ఠాత్మక విభాగాల్లో అవార్డులను సాధించింది. కొత్త తరహా కథాకథనాలు, అద్భుతమైన సాంకేతికతతో ఈ చిత్రం మలయాళ సినీప్రపంచంలో కొత్త మైలురాయిని సృష్టించిందని చెప్పాలి. 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలలో ‘భ్రమయుగం’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా మమ్ముట్టి, ఉత్తమ సహాయ నటుడిగా సిద్ధార్థ్ భరతన్, ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా క్రిస్టో జేవియర్, ఉత్తమ మేకప్ ఆర్టిస్టుగా రోనెక్స్ జేవియర్ అవార్డులు గెలుపొందారు.
తెలుగులోనూ విడుదలైన భ్రమయుగం చిత్రం ఇక్కడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో తాంత్రిక విద్యలు తెలిసిన కొడుమోన్ అనే పాత్రలో మమ్ముట్టి తన అసాధారణ నటనతో కట్టిపడేశారు. ఈ పాత్రలో మమ్ముట్టి ఒదిగిపోయిన తీరు చూస్తే, భారతదేశపు అత్యుత్తమ నటుల్లో ఒకరిగా ఆయనను ఎందుకు పరిగణిస్తారో అర్థమవుతుంది. కొన్ని తరాలకు గుర్తుండిపోయే సరికొత్త ఆలోచనలతో, సృజనాత్మక సరిహద్దులను చెరిపివేసి.. మలయాళ సినిమా ఎలా ముందుకు వెళుతుందో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణగ ‘భ్రమయుగం’.
Also Read: Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ పోస్ట్‌పోన్ రూమర్స్‌పై క్లారిటీ – చెప్పిన డేట్‌కే వచ్చేస్తోంది!
నిర్మాతలు రామచంద్ర చక్రవర్తి (నైట్ షిఫ్ట్ స్టూడియోస్), ఎస్. శశికాంత్ (వైనాట్ స్టూడియోస్) తమ సృజనాత్మక కృషిని గుర్తించినందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం, జ్యూరీ, విమర్శకులు, మీడియా, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. “ఈ అవార్డులు సృజనాత్మక కథలపై మా నమ్మకాన్ని మరింత బలపరిచాయి. మరిన్ని ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి, కేరళ సినిమాకు కొత్త దారులు చూపే ప్రయత్నాలను కొనసాగించడానికి ఇవి మాకు ప్రేరణగా నిలుస్తాయి. మా దర్శకుడు, నటీనటులు, సాంకేతిక బృందం మరియు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.” అంటూ నిర్మాతలు తమ ఆనందాన్ని పంచుకున్నారు.
గత సంవత్సరం విడుదలై విశ్వవ్యాప్త ప్రశంసలు అందుకున్న ‘భ్రమయుగం’ చిత్రానికి రాహుల్ సదాశివన్ దర్శకుడు, రచయిత కూడా. మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ వంటి ఉన్నతస్థాయి నటులు ఈ చిత్రంలోని పాత్రలకు ప్రాణం పోశారు. మంత్రముగ్ధులను చేసే కథనం, అద్భుతమైన సంగీతం, విశిష్టమైన దృశ్య శైలి ఈ సినిమాని క్లాసిక్‌గా మలిచాయి. అంతేకాదు, ఇటీవలి కాలంలో అత్యంత చర్చనీంశమైన మలయాళ చిత్రాలలో ఒకటిగా నిలిపాయి.
Also Read: RAM: మాకు ఈ ట్యాగ్స్ ఒద్దు, పాతవే ముద్దు అంటున్న చరణ్, రామ్!
‘భ్రమయుగం’ సినిమా మమ్ముట్టి నట వైభవాన్ని మరలా రుజువు చేయడమే కాకుండా, కేరళ సినిమాకు ఒక మలుపుగా నిలిచింది. సరికొత్త ఆలోచనలతో ప్రయోగాత్మక చిత్రాలు చేయాలనుకునే వారిలో ధైర్యాన్ని నింపింది.


