KGF – Harish Rai: కొంత కాలంగా కేన్సర్‌తో పోరాడుతున్న కన్నడ నటుడు హరీశ్ రాయ్ గురువారం బెంగళూరులోని కిద్వాయ్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. కల్ట్ క్లాసిక్ ‘ఓం’లో డాన్ రాయ్, ‘కేజీఎఫ్’లో ఖాసిం చాచా పాత్రలతో పాపులర్ అయిన ఆయన థైరాయిడ్ కేన్సర్‌తో బాధపడుతూ వచ్చారు. అది ఇటీవల పొట్టకు కూడా వ్యాపించింది. అనారోగ్యంతో ఆయన శరీరం శుష్కించిపోయింది. పొట్టలో నీరుచేరి ఉబ్బిపోయింది. ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తూ వస్తున్న అభిమానులు ఆయన పరిస్థితి చూసి ఆవేదన చెందారు. దురదృష్టవశాత్తూ, చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆయన కోలుకోలేకపోయారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అయిన గోపి గౌడ్రు ఇటీవల ఆయనను పరామర్శించడానికి వెళ్లిన సందర్భంగా తీసిన వీడియోను షేర్ చేయగా, అది ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అందులో తనకు ఆర్థిక సహకారం అందించాలని బహిరంగంగా అర్థించారు హరీష్. ఆరోగ్యం మెరుగవగానే నటనను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తన వైద్య చికిత్సకు ఎంత ఖర్చువుతుందో కూడా ఆయన ఆ వీడియోలో తెలిపారు.
Also Read: Jailer 2: బాలయ్య క్రేజీ డెసిషన్స్.. రెండు సినిమాలు రిజెక్ట్!
ఆ ఖర్చు గురించి అంతకు ముందు మీడియాతో మాట్లాడిన హరీశ్, ఒక్క ఇంజెక్షన్ విలువ రూ. 3.55 లక్షలని వెల్లడించారు. 63 రోజుల వ్యవధిలో మూడు ఇంజెక్షన్లు వేయించుకోవాలని డాక్టర్లు సూచించారనీ, వాటి ఖర్చు రూ. 10.5 లక్షలనీ ఆయన చెప్పారు. పలు కేసుల్లో రోగులకు 17 నుంచి 20 ఇంజెక్షన్లు అవసరమవుతాయని తెలుస్తోంది. అంటే మొత్తం చికిత్సకు సుమారుగా రూ. 70 లక్షలు అవసరమవుతాయని అంచనా.
‘కేజీఎఫ్’ హీరో యష్ ఆర్థిక సాయం చేస్తున్నట్లు వచ్చిన ప్రచారం గురించి అడిగినప్పుడు, ఇంతదాకా యష్ తనను కలవలేదని హరీశ్ స్పష్టం చేశారు. “ఇదివరకు యష్ నాకు సాయం చేశారు. ప్రతిసారీ ఆయనను అడగలేను. ఒకే మనిషి ఎంతని సాయం చేయగలడు? నా ఆరోగ్య స్థితి గురించి ఆయనకు నేను కబురు చేయలేదు. కానీ ఆయనకు తెలిస్తే మాత్రం, కచ్చితంగా నాకు అండగా నిలుస్తారని నాకు తెలుసు. ‘టాక్సిక్’ సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ నేనొక ఫోన్ కాల్ చేస్తే చాలు. నాకేదైనా అయితే యశ్‌ను సంప్రదించమని నా కొడుకులకి చెప్పాను, ఎందుకంటే ఆయన కాదనడు” అని హరీశ్ చెప్పుకొచ్చారు.
Also Read: Allu Aravind: నాకో స్థాయి ఉంది.. నేను సమాధానం చెప్పను.. బండ్ల గణేష్‌కు అల్లు అరవింద్ రిటార్ట్
సుదీర్ఘమైన తన కెరీర్‌లో హరీశ్ రాయ్ కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో నటించారు. ‘కేజీఎఫ్’ రెండు చాప్టర్లతో పాటు ఓం, సమర, బెంగుళూర్ అండర్‌వరల్డ్, జోడిహక్కి, రాజ్ బహదూర్, సంజు వెడ్స్ గీత, స్వయంవర లాంటి సినిమాల్లో ఆయన కనిపించారు. తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చిన ఆయన మృతి భారతీయ చిత్రసీమకు చెప్పుకోదగ్గ లోటు.


