Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభKota Srinivasa Rao: కూలిన 'కోట'.. డాక్టర్ కావాలని యాక్టర్‌గా మారి..

Kota Srinivasa Rao: కూలిన ‘కోట’.. డాక్టర్ కావాలని యాక్టర్‌గా మారి..

Kota Srinivasa Rao Past life: తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. తన నట జీవితంలో 750కి పైగా సినిమాల్లో నటించిన కోట.. సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసుకుందాం.

- Advertisement -

కోట శ్రీనివాసరావు 1942 జులై 10వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. ఆయన తండ్రి కంకిపాడులో డాక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించేవారు. దీంతో కోటకు కూడా చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని ఉండేది. అయితే చదువుకునే రోజుల్లో ఆయనకు నటన మీద ప్రత్యేక శ్రద్ధ ఏర్పడింది. ఆ ఇష్టంతోనే నాటకాలు వేసేవారు. అలా రంగస్థల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత బ్యాంక్ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్‌గా ఉద్యోగం చేసేవారు. అలా హైదరాబాద్‌లోని బ్యాంక్ బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఉదయం బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తూనే.. సాయంత్రం పూట రంగస్థలం మీద నాటకాలు వేసేవారు. కేవలం రవీంద్రభారతిలోనే 100కిపైగా నాటకాలు వేశారు.

అలా నాటకాలు వేస్తుండగా.. ప్రాణం ఖరీదు అనే నాటకం కోట శ్రీనివాసరావు వేశారు. ఈ నాటకాన్ని దర్శక నిర్మాత క్రాంతి కుమార్ చూసి కోటకు సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అలా 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర రంగంలోకి అరంగేట్రం చేశారు. ఈ సినిమాతోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ఇండస్ట్రీకి పరిచమయ్యారు. అయితే తర్వాత సరైన అవకాశాలు రాకపోవడంతో మళ్లీ నాటకాలు వేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే 1983లో మళ్లీ సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది.

Also Read: కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రముఖుల సంతాపం

1989లో జంద్యాల దర్శకత్వంలో వచ్చిన అహ నా పెళ్లంట సినిమాలో పిసినారి పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అప్పటి నుంచి సినిమాల్లో బిజీ నటుడిగా మారిపోయారు. అవకాశాలు పెరగడంతో బ్యాంక్ ఉద్యోగం మానేసి నటుడిగా స్థిరపడ్డారు. ఇలా తన కెరీర్‌లో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించి శభాష్ అనిపించుకున్నారు. కమెడీయన్‌గా, భీకర విలన్‌గా, అమాయక తండ్రిగా, అల్లరి తాతయ్యగా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. తన పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో ‘కోట’ నిర్మించుకున్నారు. భౌతికంగా మన మధ్య ‘కోట’ కూలిపోయినా సినిమా రంగం ఉన్నంత వరకు తన పేరును చిరస్థాయిగా నిలుపుకోవడంతో విజయవంతమయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad