ED Raids: లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసు మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లల్లో బుధవారం ఈడీ సోదాలు నిర్వహించింది. విదేశాల నుంచి లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్న వ్యవహారం కస్టమ్స్ అధికారుల ఇన్వేస్టిగేషన్‌లో బయటపడింది. ఖరీదైన కార్ల దిగుమతికి దేశంలోని పలువురు సెలిబ్రిటీలకు లింక్ ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆపరేషన్ నమకూర్ పేరుతో సెలిబ్రిటీల నివాసాలు, ఆఫీస్‌లపై కస్టమ్స్, ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
ఈడీ దాడులు…
మలయాళ అగ్ర హీరోలు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లలో ఇటీవల కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. తాజాగా బుధవారం ఈడీ అధికారులు ఈ స్టార్ హీరోల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. కేరళ, తమిళనాడులోని మొత్తం పదిహేడు చోట్ల దాడులు చేపడుతున్నట్లు సమాచారం. చెన్నైలోని మమ్ముట్టి ఆఫీస్‌తో పాటు మలయాళ నటుడు అమిత్ చకల్‌కల్ ఇంటిలో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. కస్టమ్స్, ఈడీ ఒకరి తర్వాత మరొకరు స్టార్ హీరోల ఈళ్లపై దాడులు చేయడం మలయాళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ దాడులపై ఇప్పటివరకు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమార్ మాత్రం రియాక్ట్ కాలేదు. దుల్కర్ సల్మాన్‌తో పాటు అమిత్ చకల్‌కల్ కార్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. పృథ్వీరాజ్ సుకుమారన్ వద్ద ఉన్న కార్లను మాత్రం సీజ్ చేయలేదని ప్రచారం జరుగుతోంది.
లగ్జరీ కార్లు…
లాండ్ క్రూయిజర్, డిఫెండర్, మసారెట్టి వంటి ఖరీదైన కార్లను దిగుమతి సుంకాలు చెల్లించకుండా భూటాన్, నేపాల్‌ల మీదుగా దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ కార్లను అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ స్టేట్స్ రిజిస్ట్రేషన్‌తో సెలిబ్రిటీలకు చాలా తక్కువ ధరలకు అమ్ముతున్నట్లు తేలింది. ఇప్పటివరకు 150 నుంచి రెండు వందల వరకు కార్లను కేరళలోకి దొంగతనంగా దిగుమతి చేసుకున్నట్లు ఇన్వేస్టిగేషన్‌లో బయటపడింది. లగ్జరీ కార్లను వాడుతున్న సెలిబ్రిటీల లిస్ట్ మొత్తం బయటపడినట్లు తెలిసింది. ఇందులో మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
పాన్ ఇండియన్ హీరోలు..
దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమార్ పాన్ ఇండియన్ హీరోలుగా ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ తెలుగులో ఆకాశంలో ఒక తారతో పాటు రవి నేలకుడితి డైరెక్షన్‌లో మరో ప్రేమకథా చిత్రం చేస్తున్నాడు.
మరోవైపు పృథ్వీరాజ్ సుకుమారన్.. మహేష్‌బాబు, రాజమౌళి సినిమాతో పాటు ప్రభాస్ సలార్ 2లో నటిస్తున్నాడు.
Also Read- OG Movie OTT Release : ఓటీటీలోకి ఓజీ.. డేట్ ఫిక్స్! అదనపు సీన్స్, స్పెషల్ సాంగ్స్ తో!


