ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas)గురించి హీరోయిన్ పూనమ్ కౌర్(Poonam Kaur) సంచలన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ‘త్రివిక్రమ్‌పై చాలా కాలం కిందట మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశాను. ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు. ఆయనను ప్రశ్నించడం లేదు. చర్యలు తీసుకోవడం జరగలేదు. నా జీవితాన్ని నాశనం చేసి, ఆరోగ్యంగా, ఆనందంగా లేకుండా చేసిన అతడిని ఇంకా ఇండస్ట్రీ పెద్దలు ప్రోత్సహిస్తున్నారు’ అని ఆమె పేర్కొన్నారు.
తాజాగా పూనమ్ ఆరోపణలపై మా ఆసోసియేషన్ స్పందించింది. పూనమ్ కౌర్ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని ‘మా’ కోశాధికారి శివబాలాజీ(Siva Balaji) తెలిపారు. గతంలో ఫిర్యాదు ఇచ్చినట్టు కూడా రికార్డులలో లేదన్నారు. ఇలాంటి విషయాలు సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ‘మా’ అసోసియేషన్‌ను లేదా కోర్టులను కానీ ఆశ్రయిస్తేనే న్యాయం జరుగుతుందని సూచించారు.