Mahavatar Narsimha Collections: భారతీయ సినిమా రంగంలో పౌరాణిక కథలు, రొమాంటిక్ కామెడీలకు ఆదరణ ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ఈ వరుసలో మరో చిత్రం చేరింది.. అదే ‘మహావతార్ నరసింహ’. ఆసక్తికరమైన విషయం ఇదొక యానిమేటెడ్ మూవీ అనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డ్ కలెక్షన్స్‌ను సాధిస్తోంది. హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ యానిమేటెడ్ చిత్రం.. జూలై 25న ఐదు భారతీయ భాషలలో 3Dలో విడుదలైంది. విడుదలైన కేవలం 26 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 280 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇంతేకాకుండా, ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల మార్క్‌ను దాటిన తొలి భారతీయ యానిమేటెడ్ చిత్రంగా ‘మహావతార్ నరసింహ’ నిలవటమే కాకుండా భారతీయ యానిమేషన్ చరిత్రలో ఒక మైలురాయిని స్థాపించింది.
‘మహావతార్ నరసింహ’ సినిమాలో స్టార్ హీరోహీరోయిన్స్ లేరు. అలాగే గ్లామర్ పాటలు, యాక్షన్ సీన్స్ అసలే లేవు. అయినప్పటికీ ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం కేవలం వాణిజ్యపరంగా విజయం సాధించడమే కాకుండా యానిమేషన్ రంగంలో భారతీయ సినిమా స్థాయిని పెంచింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అత్యాధునిక యానిమేషన్ టెక్నాలజీతో సాంప్రదాయ పురాణాలను కలగలిపి రూపొందించబడింది. గ్రాండ్ విజువల్స్, భావోద్వేగ కథ, పౌరాణిక మూలాల నుండి తీసుకున్న అంశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. విష్ణువు యొక్క పది అవతారాలపై ఆధారపడిన కథాంశం అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటోంది.
Also Read – Thalapathy Vijay Politics: పవన్ కళ్యాణ్‌పై దళపతి విజయ్ సెటైర్ వేశాడా!
‘మహావతార్ నరసింహ’ సాధించిన ఈ అపూర్వ విజయంతో, హోంబాలే ఫిల్మ్స్ విష్ణువు యొక్క పది అవతారాల ఆధారంగా మరిన్ని చిత్రాలను నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో మహావతార్ పరశురామ్ (2027), మహావతార్ రఘునందన్ (2029), మహావతార్ ద్వారకాధీష్ (2031), మహావతార్ గోకులానంద (2033), మహావతార్ కల్కి (2037) వంటి చిత్రాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సిరీస్ రెండు భాగాలుగా ఉండనుంది.
కన్నడ చిత్ర నిర్మాణ సంస్థల్లో టాప్‌గా నిలుస్తూ క్రేజీ భారీ బడ్జెట్ చిత్రాలను హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) నిర్మిస్తోంది. ఇప్పటికే కాంతార (Kantara) చిత్రంతో పాటు కెజియఫ్ మూవీతోనూ (KGF movie) పాన్ ఇండియా లెవల్లో ఈ సంస్థ తనదైన గుర్తింపును సంపాదించుకుంది. కాంతార వంటి మీడియం బడ్జెట్ మూవీతో భారీ హిట్‌ను అందుకున్న హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు మరోసారి ‘మహావతార్ నరసింహ’ అలాంటి సక్సెస్‌నే సొంతం చేసుకుంది. భక్త ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు మధ్య భక్తికి సంబంధించిన నడిచిన కథాంశంతో సినిమా తెరకెక్కింది.
తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ (Geeta Arts) సంస్థ విడుదల చేసింది. కాంతార పార్ట్ వన్‌ను కూడా ఈ సంస్థనే తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసి హిట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి మహావతార్ నరసింహను కూడా విడుదల చేసి విజయాన్ని సొంతం చేసుకుంది.
Also Read – Vodafone Idea: వొడాఫోన్ ఐడియాకు ఊరట.. 9 శాతం దూసుకెళ్లిన షేర్లు


