SSMB29: మహేష్‌బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ29 మూవీ కోసం వరల్డ్‌వైడ్‌గా సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తో హాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన రాజమౌళి పాన్ వరల్డ్ టార్గెట్‌తో మహేష్‌బాబు మూవీని రూపొందిస్తున్నారు. ఈ గ్లోబ్ ట్రాటర్ సినిమాపై రోజురోజుకు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఎస్ఎస్ఎంబీ29 స్టోరీ ఏంటి? మహేష్‌బాబు క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అన్నది ఇప్పటి వరకు రాజమౌళితో పాటు సినిమా యూనిట్ ఎక్కడ రివీల్ చేయలేదు. చిన్న అప్‌డేట్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయినా లీకులు మాత్రం ఆగడం లేదు. కెన్యా షెడ్యూల్‌కు సంబంధించి మహేష్‌బాబు ఫొటో ఒకటి లీకయ్యింది.
డివోషనల్ టచ్…
తాజాగా ఎస్ఎస్ఎంబీ29 సినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొత్త రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్‌ను రాజమౌళి పరిశీలిస్తున్నారట. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా మహేష్‌బాబు మూవీని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. అయితే ఈ మూవీలో డివోషనల్ ఎలిమెంట్స్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. అన్ని భాషల ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే టైటిల్ కోసం అన్వేషించిన రాజమౌళి చివరకు వారణాసి అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్‌లో మహేష్‌బాబు మెడలో త్రిశూలం, ఢమరుకం, నంది ఉన్న లాకెట్ కనిపించింది. డివోషనల్ ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయని ఈ ప్రీ లుక్ పోస్టర్‌తో రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. కథకు వారణాసి అనే టైటిల్ యాప్ట్ అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
నవంబర్‌లో ఫస్ట్ గ్లింప్స్…
ఎస్ఎస్ఎంబీ29 ఫస్ట్ గ్లింప్స్‌ను నవంబర్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు మహేష్‌బాబు బర్త్‌డే రోజున రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్లింప్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడన్నది కన్ఫామ్ అయ్యింది. నవంబర్ 16న గ్లోబ్ ట్రాటర్ మూవీ ఫస్ట్ గ్లింప్స్ విడుదలకానున్నట్లు చెబుతున్నారు. ఈ వీడియో గ్లింప్స్‌కు సంబంధించి ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ గ్లింప్స్‌తోనే టైటిల్‌తో పాటు మహేష్‌బాబు ఫస్ట్ లుక్ రివీల్ చేయబోతున్నారు.
వారణాసి సెట్…
ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ లేటెస్ట్ షెడ్యూల్ కోసం వారణాసి సిటీని తలపించేలా ఓ భారీ సెట్ వేశారట మేకర్స్. ఈ సెట్‌లోనే మహేష్‌బాబు, ప్రియాంక చోప్రాతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో మహేష్‌బాబు, ప్రియాంక చోప్రాలపై ఓ ఫోక్ సాంగ్ కూడా ఉంటుందని అంటున్నారు. ఈ సాంగ్‌కు సంబంధించిన ట్యూన్స్‌ను కీరవాణి రెడీ చేసినట్లు చెబుతున్నారు. ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కిచ్చేలా పాట ఉంటుందని సమాచారం. ఈ గ్లోబ్ ట్రాటర్ మూవీ 2027లో రిలీజ్ కాబోతుంది. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


