Mammootty: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. దీంతో ఆయన అభిమానులతో పాటు సినీ వర్గాలు కొంత ఆందోళనకి గురయ్యారు. తాజాగా దీనికి తెరపడింది. మమ్ముట్టి అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆయన త్వరలోనే మళ్లీ సినిమాల షూటింగ్ కోసం కెమెరా ముందుకు రాబోతున్నారు. ఈ విషయాన్ని మమ్ముట్టి సోదరుడు ఇబ్రహీంకుట్టి అధికారికంగా ప్రకటించారు. ఈ విషయం తెలియడంతో మమ్ముట్టి అభిమానులు, సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నాయి.
గత కొంతకాలంగా మమ్ముట్టి అనారోగ్య కారణంగా సినిమాలకి దూరంగా ఉంటున్నారు. ఇక మంగళవారం మోహన్‌లాల్, ఎంపీ జాన్ బ్రిట్టాస్ సహా పలువురు సినీ ప్రముఖులు మమ్ముట్టి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో అభిమానుల్లో ఆందోళన ఎక్కువైంది. మమ్ముట్టి ఆరోగ్య పరిస్థితిపై మళ్లీ పరిశ్రమలో, అభిమానుల్లో తీవ్రమైన చర్చ మొదలైంది. ఈ గందరగోళానికి తెరదించుతూ, మమ్ముట్టి సోదరుడు ఇబ్రహీంకుట్టి ఫేస్‌బుక్ ద్వారా ఒక ఎమోషనల్ పోస్టుని పెట్టారు. ఇందులో ఆయన క్లారిటీ ఇచ్చారు.
Also Read – Kollywood: మల్టీస్టారర్ మూవీ సెట్ చేసిన లోకేష్ కనగరాజ్ – రజనీకాంత్, కమల్ హాసన్ కాంబో ఫిక్స్!
“కారుమబ్బులు కమ్మిన కల్లోల సముద్రాన్ని దాటిన నావలా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాను. మనసును తొలిచేస్తున్న ఆందోళనలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు పునరాగమన సమయం ఆసన్నమైంది” అంటూ ఇబ్రహీంకుట్టి తన పోస్టులో రాసుకొచ్చారు.
“గత కొంతకాలంగా నేను ఎక్కడికి వెళ్లినా, అందరూ మా ఇచక్క (మమ్ముట్టి ముద్దుపేరు) గురించే అడిగేవారు. రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో, వీధుల్లో సహా ఎక్కడ కనిపించిన్నా అభిమానులు ప్రేమగా పలకరించి ‘మమ్ముక్క బాగున్నారా?’ అని అడిగేవారు. ‘ఆయన బాగున్నారు’ అని నేను చెప్పగానే.. వారి ముఖాల్లో ఆనందం కనిపించింది. అది చూసి నేను ఆశ్చర్యపోయేవాడిని. ప్రపంచమంతా ఒక వ్యక్తి కోసం ఇంతగా ప్రార్థిస్తుందా? అవును, నేను చూసిన ఈ ప్రపంచం ఇచక్క కోసం ఎంతగానో ప్రార్థించింది. పరిస్థితి మరీ ప్రమాదకరంగా లేకపోయినప్పటికీ, నా హృదయంలో ఏదో తెలియని భారం ఉండేది. కోట్లాది మందితో పాటు నా ప్రతి శ్వాసలోనూ ప్రార్ధిస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఆ కష్ట కాలాన్ని దాటడంతో సముద్రాన్ని ఈదినంత భావన కలుగుతోంది” అని ఆయన ఉద్వేగభరితంగా ఈ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ఇంతటి కష్టతరమైన సమయంలో మాకు అండగా నిలిచి, మా సోదరుడి కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఇబ్రహీంకుట్టి తెలిపారు. “ఇచక్కపై నిస్వార్థమైన ప్రేమను కురిపించిన వారికి, ప్రార్థనలు చేసిన వారికి, ఆయన తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న ప్రతి ఒక్కరికీ, ఆ దేవుడికి నా ధన్యవాదాలు” అంటూ పోస్టులో పేర్కొన్నారు. ఇక ఈ పోస్ట్‌తో మమ్ముట్టి రీఎంట్రీ కన్‌ఫర్మ్ అని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read – Mokshagna : మోక్షజ్ఞ లవ్ స్టోరీ చూడాలనుకుంటున్నా – నారా రోహిత్
అలాగే, నటుడు వి.కె. శ్రీరామన్ కూడా స్పందిస్తూ, మమ్ముట్టికి మొదట్లో ఆహారం రుచి తెలియకపోవడం వంటి సమస్యలు వచ్చాయని, అయితే.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారని వెల్లడించారు. మొత్తానికి మమ్ముట్టి తిరిగి పూర్తిగా కోలుకోవడం అందరికీ ఎనలేని ఆనందాన్ని కలిగించే విషయం అని చెప్పక తప్పదు.


