Manchu Manoj| మంచు కుటుంబం వివాదంపై మనోజ్ మరోసారి స్పందించారు. జర్నలిస్టులపై మోహన్ బాబు(Mohan babu) దాడి చేసిన ఘటనపై వివరణ ఇచ్చారు. తనను ఇంట్లోకి అనుమతించకపోవడంతో ఏం చేయలేని స్థితిలో తాను మీడియాను ఇంటి లోపలికి తీసుకువెళ్లానని తెలిపారు. అయితే లోపలికి వెళ్లాక ఆకస్మాత్తుగా వారిపై దాడి చేశారన్నారు. ఇందులో మీడియా ప్రతినిధుల తప్పు ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు.
అలాగే తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై సరైన ఆధారాలను త్వరలోనే బయటపడతానని చెప్పారు. వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు సంయమనం పాటించాలని కోరారు. సీసీ ఫుటేజీని బయటపెడితే అసలు నిజాలు తెలుస్తాయన్నారు. ఆత్మరక్షణ కోసమే తాను వినయ్ అనే వ్యక్తిని దూరంగా నెట్టివేసినట్లు వివరించారు.
కాగా మంచు కుటుంబం వివాదాన్ని పరిష్కరించేందుకు డిసెంబర్ 10న మీడియా ప్రతినిధులు మోహన్ బాబు నివాసం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయిన విషయం విధితమే.