భక్త కన్నప్ప చరిత్ర తెలుగు వారికి ఎంతో ప్రత్యేకం. ఈ కథ ఆధారంగా మంచు విష్ణు రూపొందిస్తున్న సినిమా కన్నప్ప. ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా స్టార్ హీరోలను కూడగట్టారు. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మైథలాజికల్ ఫిల్మ్ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే టీజర్లు, పాటలు విడుదలై సినిమాపై అంచనాలు పెంచగా… తాజాగా మరో కొత్త పాటను విడుదల చేశారు. ఈ పాట ప్రత్యేకతేంటంటే… శ్రీకాళహస్తి ఆలయ మహిమాన్వితతను పాట రూపంలో అద్భుతంగా వివరించారు. ఈ పాటకు సంగీతం అందించిన వ్యక్తి ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ స్టీఫెన్ దేవసి. ఆధ్యాత్మికత, శివునిపై భక్తిని కలగజేసేలా ఆయన ట్యూన్స్ ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ఇక పాటను సుద్దాల అశోక్ తేజ రాశారు. తనదైన శైలిలో శ్రీకాళహస్తి దేవాలయం వైభవాన్ని కవిత్వంగా వర్ణించారు.
అయితే ఈ పాటలో మరో ప్రత్యేకత ఉంది. మంచు విష్ణు కుమార్తెలు అరియనా మరియు వివియానా ఈ పాటను స్వయంగా ఆలపించారు. అంతే కాదు… సినిమాలో ఈ ఇద్దరూ ఈ పాటకు డ్యాన్స్ కూడా చేశారు. చిన్నారుల గాత్రంలో భక్తిభావంతో నిండి ఉండే ఈ పాట ప్రేక్షకులను తడిమేస్తోంది. శ్రీకాళహస్తి అంటే శైవభక్తికి ప్రతీక. వాయు లింగం క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర స్థలాన్ని పాట రూపంలో ఆవిష్కరించడంలో చిత్రబృందం విజయవంతమైందని చెప్పొచ్చు. “కన్నప్ప” సినిమా ఎలా ఉంటుందో చెప్పడం కష్టం కానీ, ఈ పాట మాత్రం చక్కగా నిండింది అనే అభిప్రాయం చాలా మందిలో స్పష్టంగా కనిపిస్తోంది.