Manisharma : మెలోడీ బ్రహ్మ మణిశర్మ అని అందరూ పిలుచుకుంటారు. 2000వ దశకంలో ఏ సినిమా పాటలు విన్నా మణిశర్మ గుర్తొచ్చేవారు. ఎంతో మంది స్టార్ హీరోలకి సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు. ఇక మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సినిమాల్లో హీరోలకి తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఎలివేషన్స్ ఇచ్చారు.
ఇక చిరంజీవి, మణిశర్మ కాంబో అంటే జనాలకి పండగే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి పాట సూపర్ డూపర్ హిట్ అయింది. చిరు-మణిశర్మ కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. ఒకానొక సమయంలో చిరంజీవి సినిమా అంటే మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ అని అంతా ఫిక్స్ అయ్యారు. చివరగా ఇటీవల ఆచార్య సినిమా చేశారు. అయితే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది.
తాజాగా అలీతో సరదాగా ప్రోగ్రాంకి వచ్చిన మణిశర్మని అలీ ఆచార్య సినిమా గురించి ప్రశ్నించాడు. అలీ మాట్లాడుతూ.. మీరు, చిరంజీవి కాంబినేషన్ అంటే ఆ పాటలు సూపర్ హిట్ అవుతాయి. అలాంటిది ఆచార్య పాటలకి ఎందుకు అంత గుర్తింపు రాలేదు అని అడిగారు.
మణిశర్మ దీనికి సమాధానమిస్తూ.. అందులో రెండు పాటలు బాగానే హిట్ అయ్యాయి. అయినా నేను సినీ పరిశ్రమకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా చిరంజీవి సినిమాలకే పని చేశాను. చిరంజీవి గారికి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో నాకు తెలుసు. ఆచార్య సమయంలో నేను ఒక వర్షన్ చేసి ఇచ్చాను కానీ డైరెక్టర్ కొరటాల శివ ఇలా వద్దు, ఈ సారి కొత్తగా ట్రై చేద్దాం అన్నారు. అందుకే నేను మ్యూజిక్ మార్చాల్సి వచ్చింది. అందులో తప్పులేదు. కొత్తదనం ట్రై చేయాలి. అవి ఒక్కోసారి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు” అని అన్నారు. దీంతో మరోసారి ఆచార్య ఫెయిల్యూర్ కి డైరెక్టర్ కొరటాల శివనే కారణం అని చెప్పకనే చెప్పారు.