Film Chamber Issue: తెలుగు సినీ పరిశ్రమ (టాలీవుడ్) ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతోంది. ఒకప్పుడు పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా దివంగత దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) ఇండస్ట్రీ పెద్దమనిషిగా వ్యవహరించి, న్యాయవాదిలా కాకుండా న్యాయమూర్తిలా అందరికీ న్యాయం జరిగేలా చూసేవారు. అయితే ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని అలాంటి కీలక స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రస్తుతం ఎవరూ సిద్ధంగా లేరు. ఈ పరిస్థితులలో సినిమా కార్మికుల వేతనాల పెంపు డిమాండ్ ఒక ప్రధాన సమస్యగా పరిణమించింది, ఇది ఇండస్ట్రీలో ఒక పెద్ద వివాదానికి దారి తీసింది.
గత 13 రోజులుగా సినీ కార్మికులు తమ వేతనాలను పెంచాలని (Wages Hike) గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో స్పష్టత వస్తుందని చాలా మంది ఆశించినప్పటికీ ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ఒకవైపు నిర్మాతలు తాము సూచించిన కొన్ని డిమాండ్స్‌కు ఒప్పుకుంటేనే వేతన పెంపు నిర్ణయం గురించి ఆలోచిస్తామని కచ్చితంగా చెప్పేశారు. మరోవైపు సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇది రోజురోజుకు మరింత జటిలమైన సమస్యగా మారుతోంది. దీనివల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్యను మెగాస్టార్ చిరంజీవి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సమస్య వచ్చినప్పుడే సినిమా కార్మికుల సమస్య గురించి చిరంజీవి (Megastar Chiranjeevi) మాట్లాడారు. ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించుకోవాలని, లేకపోతే తాను రంగంలోకి దిగుతానని ఆయన తెలియజేశారు. ఇప్పుడు అదే జరుగుతుంది, చిరంజీవి మధ్యవర్తిత్వంతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశలు చిగురిస్తున్నాయి. ఆదివారం చిరంజీవి ఇంట్లో ఇటు నిర్మాతలతో, ఫెడరేషన్ నాయకులతో వేర్వేరుగా సమావేశం జరగనుంది. చిరంజీవి సమక్షంలో జరిగే ఈ మీటింగ్ తర్వాత సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/varsha-bollamma-web-series-constable-kanakam-web-series-review/
ఈ వేతనాల చర్చలు జరుగుతున్న కారణంగా ప్రస్తుతం హైదరాబాద్‌లో సినిమా షూటింగ్‌లన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల పరిశ్రమలో తీవ్ర ఇబ్బంది నెలకొంది. ఇప్పటికే విడుదల తేదీలు ప్రకటించిన సినిమాల షూటింగ్‌లు జరగకపోవడంతో వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న చిత్రాలకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా, షూటింగ్ దశలో ఉన్న సినిమాలకు మాత్రం ఇది పెద్ద సమస్యగా మారింది. మెగాస్టార్‌తో మీటింగ్ పూర్తయిన తర్వాత మళ్లీ షూటింగ్‌లు మొదలయ్యే అవకాశం ఉంది. అయితే, ఇది అంత సులువుగా తేలే వ్యవహారం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. చర్చల అనంతరమే దీనిపై మరింత క్లారిటీ వస్తుందని అందరూ భావిస్తున్నారు.


