Mega Family: 2025లో మెగా హీరోల సందడి అంతగా కనిపించలేదు. ఈ ఏడాది మెగా హీరోలు నటించిన మూడు సినిమాలు మాత్రమే రిలీజయ్యాయి. రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్‌తో పాటు పవన్ కళ్యాణ్ ఓజీ, హరిహరవీరమల్లు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిలో ఓజీ మాత్రమే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 2025లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తెలుగు మూవీగా నిలిచింది. గేమ్ ఛేంజర్‌తో పాటు హరిహరవీరమల్లు నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చాయి.
సంక్రాంతి బరిలో చిరంజీవి…
2026లో మెగా హీరోల నుంచి సినిమాల జాతర ఉండబోతుంది. జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల్లో ముగ్గురు మెగా హీరోలు టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో నిలవబోతున్నారు. చిరంజీవి హీరోగా నటించిన మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతికి కానుకగా జనవరిలో థియేటర్లలోకి రాబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో మరో టాలీవుడ్ అగ్ర హీరో వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్‌లో తెలుగులో వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో మన శంకర వరప్రసాద్‌గారుపై అంచనాలు భారీ రేంజ్‌లోనే ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఇటీవల రిలీజ్ చేసిన మీసాల పిల్ల పాట పెద్ద హిట్టయ్యింది. టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ లేని డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్‌తో సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ చేస్తాడన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
Also Read: Lava Shark 2 Launched: బడ్జెట్ ధరలో లావా షార్క్ 2 లాంచ్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
ఫిబ్రవరిలో ఉస్తాద్…
ఓజీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ బ్లాక్‌బస్టర్ తర్వాత ఉస్తాద్ భగత్‌సింగ్‌తో అభిమానుల ముందుకు రాబోతున్నారు పవర్ స్టార్. హరీష్ శంకర్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్నట్లు ప్రచారంజరుగుతోంది. ఇప్పటికే ఉస్తాద్ భగత్‌సింగ్‌లో పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ఉస్తాద్ భగత్‌సింగ్‌లో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.
మార్చిలో పెద్ది…
పెద్ది మూవీ రామ్‌చరణ్ బర్త్‌డే కానుకగా మార్చి 27న థియేటర్లలోకి రాబోతుంది. రామ్‌చరణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించబోతున్నది. స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న పెద్దికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రంగస్థలం తర్వాత మరోసారి రగ్గ్‌డ్ రోల్‌లో రామ్‌చరణ్ నటిస్తున్న మూవీ ఇది. ఈ సినిమాలో కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌తో రామ్‌చరణ్‌పై దారుణంగా విమర్శలొచ్చాయి. పెద్ది సక్సెస్ చరణ్‌కు కీలకంగా మారింది.
ఈ సినిమాలే కాకుండా వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, సాయి ధరమ్‌తేజ్ సంబరాల ఏటిగట్లు వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే థియేటర్లలోకి రాబోతున్నాయి.
Also Read: Montha Cyclone: ముంచుకొస్తున్న సూపర్ సైక్లోన్.. కోస్తా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ


