Film Chamber Issue: తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న కార్మికుల సమ్మె ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. దాదాపు 8 రోజులుగా కొనసాగుతున్న ఈ సమ్మె కారణంగా సినీ షూటింగ్‌లు నిలిచిపోయాయి. సినీ కార్మికులు తమ వేతనాల్లో 30 శాతం పెంపును డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఇరు వర్గాలు కూడా ‘తగ్గేదే లేదు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి, ఇది పరిశ్రమలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఇలాంటి కీలక దశలో, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగంలోకి దిగారు. సోమవారం సచివాలయంలో ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు, వివిధ సినిమా సంఘాల ప్రతినిధులు మంత్రితో భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో, కార్మికుల సమస్యలపై మంత్రి క్షుణ్ణంగా చర్చించారు. కార్మికుల సమ్మె విషయంలో నిర్మాతలు కాస్త తగ్గాలని ఆయన స్పష్టంగా సూచించారు. ఫెడరేషన్‌తో చర్చించి వారి సమస్యలు పరిష్కరించే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని నిర్మాతల మండలికి పిలుపునిచ్చారు. అదే సమయంలో యూనియన్లు సమ్మె చేయడం సరైంది కాదని కూడా మంత్రి పేర్కొన్నారు. నిర్మాతలు సూచించిన విధంగా ఇయర్ వైస్ పెంపుకు ఫెడరేషన్ సభ్యులు అంగీకరించాలని ఆయన హితవు పలికారు.
మంత్రి సానుకూలంగా స్పందించారని ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు. “మా పరిస్థితిని మంత్రికి వివరించాము. ఆయన అనేక అంశాలపై సానుకూలంగా స్పందించారు. మేము చెప్పిన సమస్యలపై ఆయన నిర్మాతలకు ఫోన్ చేసి మాట్లాడారు” అని ఫెడరేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. రేపటి ఫిల్మ్ ఛాంబర్ భేటీలో సానుకూల స్పందన వస్తుందని తాము నమ్ముతున్నామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. రేపటి భేటీలోనే అంతిమ నిర్ణయం ఉంటుందని తమ కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారని తెలిపారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ ప్రభుత్వం కార్మికుల పక్షమని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సినీ కార్మికుల సమ్మె కారణంగా నిలిచిపోయిన పెండింగ్ షూటింగ్‌ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి సహకరించాలని ఆయన ఫెడరేషన్‌ను కోరారు. సినిమా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కమిటీ అన్ని పక్షాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. బుధవారం నుండి షూటింగ్స్ పునఃప్రారంభమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్మాతల మండలి మాత్రం 30 శాతం వేతనాల పెంపు కుదరదని, సమ్మె విరమించి షూటింగ్‌లకు వచ్చిన వారితో పని చేయించుకుంటామని, లేదా ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తెప్పించుకుని షూటింగ్స్ కొనసాగిస్తామని హెచ్చరించింది. అయితే, ఫెడరేషన్ కూడా వేతనాలు పెంచకపోతే సమ్మె విరమించేది లేదని, ఎన్ని రోజులైనా తమ నిరసన కొనసాగుతూనే ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో, మంత్రి మధ్యవర్తిత్వం ఎంతవరకు ఫలితాన్నిస్తుందో చూడాలి. రేపటి సమావేశంపైనే సినీ పరిశ్రమ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/car-controversy-clarity-given-by-actress-nidhi-agarwal/


