Komatireddy Venkat Reddy: తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపుకు ఇక నుంచి అనుమతులు ఇచ్చేది లేదని సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణలో ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపు జీవో తనకు తెలియకుండానే ఇచ్చారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణలో ఇక ముందు నుంచి చిన్న సినిమాలు, పెద్ద సినిమాలకు ఒకటే టికెట్ రేటును అమలు చేస్తామని, టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు ఇచ్చేది లేదని పేర్కొన్నారు. సామాన్యులకు అందుబాటులో ఉన్న ఏకైక వినోద మాధ్యమం సినిమానే. వారిని సినిమాలకు దూరం చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మినిస్టర్ చెప్పారు. టికెట్ రేట్లు పెంచమని నిర్మాతలు ఎవరూ తన వద్దకు రావొద్దని అన్నారు. బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
నాకు తెలియకుండానే…
ఓజీ టికెట్ రేట్ల ఇష్యూపై కూడ మినిస్టర్ రియాక్ట్ అయ్యారు. తనకు తెలియకుండానే టికెట్ రేట్ల పెంపు జీవోను జారీ చేశారని అన్నారు. ‘ఏపీలో అనుమతులు ఇచ్చారు కాబట్టి తెలంగాణలో కూడా టికెట్ ధరలను పెంచుకునే అవకాశం కల్పించి ఉంటారని అనుకుంటున్నా. ఓజీ టికెట్ రేట్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనదే. ఆ తీర్పును స్వాగతిస్తున్నా’ అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆయన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. తన అంగీకారం లేకుండా ఓజీ టికెట్ రేట్లు పెంపు జీవో విడుదల చేసిన హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
కోర్టు సస్పెండ్…
ఓజీ మూవీ ప్రీమియర్స్‌తో పాటు వారం రోజుల పాటు మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ టికెట్ ధరలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోపై మహేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఓజీ మేకర్స్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపై శుక్రవారం వరకు డివిజన్ బెంచ్ స్టేను విధించింది. శుక్రవారం రోజు ఎలాంటి తీర్పు వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ హైకోర్టు తీర్పుతో డివిజన్ బెంచ్ ఏకీభవిస్తే తెలంగాణలో ఓజీ కలెక్షన్స్‌కు గట్టి దెబ్బ పడుతుంది.
Also Read- Sujeeth: సాహో తర్వాత రామ్‌చరణ్‌తో సినిమా మిస్సయ్యింది – ఓజీ 2 అకీరాతో – సుజీత్ కామెంట్స్
90 కోట్ల కలెక్షన్స్…
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ మూవీకి సుజీత్ దర్శకత్వం వహించాడు. గురువారం రిలీజైన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ మొదటిరోజు 90 కోట్ల వసూళ్లను దక్కించుకున్నది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మొదటిరోజు హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.


