నటుడిగా తనకు దర్శకరత్న దివంగత దాసరి నారాయణరావు తొలి అవకాశం ఇచ్చారని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) తెలిపారు. 1975లో ‘స్వర్గం నరకం’ సిని మా ద్వారా విలన్‌గా సినీ పరిశ్రమకు పరిచయమయ్యానని చెప్పారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన సొంత బ్యానర్ లక్ష్మీప్రసన్న పిచ్చర్స్‌ను అన్న ఎన్టీఆర్ ప్రారంభించారని గుర్తుచేసుకున్నారు. నిర్మాతగా తన తొలి సినిమా ‘ప్రతిజ్ఞ’కు చంద్రబాబు క్లాప్ కొట్టారని వెల్లడించారు. అదే బ్యానర్‌పై తన ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టి ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా తీశానన్నారు. ఎన్టీఆర్ వద్దు అని చెప్పినప్పటికీ, మొండిగా సినిమా తీసి సక్సెస్ అయ్యానని వెల్లడించారు.
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈస్థాయికి వచ్చానని ఎమోషనల్ అయ్యారు. రాజకీయాలు తనకు సెట్ అవ్వవని అన్నారు. దేవుడి దయతో మంచి పాత్రలు వస్తే నటిస్తానని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 560 సినిమాలు తీశానని చెప్పారు. తనను ఎంతోమంది మోసం చేశారని అప్పటి నుంచే తనకు ఆవేశం వచ్చిందని పేర్కొన్నారు. దేవుడి దయవల్లే ‘కన్నప్ప’ సినిమాలో తనకు అవకాశం వచ్చిందని… దేవుడి ఆశీస్సులతోనే ఈ సినిమా పూర్తయిందని చెప్పారు. తన దృష్టిలో ప్రజలే ప్రత్యక్ష దేవుళ్లు అని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.