నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు మోహన్ బాబుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం నాలుగు వారాలకు విచారణను వాయిదా వేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నష్టపరిహారం కావాలా..? జైలుకు పంపాలా..? ప్రతివాదులను ప్రశ్నించింది. ప్రతివాదులు దాఖలు చేసే కౌంటర్‌లో అన్ని విషయాలు స్పష్టం చేయాలని ఆదేశించింది. మోహన్ బాబు తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గి వాదన వినిపించారు.
కాగా జర్నలిస్టుపై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తనను పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు.