Mohan babu: జర్నలిస్టుల ఆందోళనలపై ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు. తన నివాసం దగ్గర ఆయన చేసిన దాడిలో ఓ జర్నలిస్టుకు తీవ్ర గాయాలు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ జర్నలిస్టును మోహన్ బాబు, మంచు విష్ణు పరామర్శించారు. ఈ సందర్భంగా అతడి కుటుంబ సభ్యులకు బహిరంగ క్షమాపణ చెప్పారు. తాను ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టును కొట్టలేదని స్పష్టం చేశారు.
కాగా జర్నలిస్టుపై దాడి ఘటనలో తనపై నమోదైన హత్యాయత్నం కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ బెయిల్ పిటిషన్ న్యాయస్థానం కొట్టివేసిందని.. ఈ నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు మోహన్ బాబు ఇంటికి వెళ్లారనే వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఇంట్లో లేకపోవడంతో పోలీసులు గాలిస్తున్నారంటూ కథనాలు వెల్లువడ్డాయి. తాజాగా ఈ వార్తలను మోహన్ బాబు ఖండించిన విషయం విధితమే.