హాలీవుడ్ బ్లాక్‌బాస్టర్ మూవీ ‘ది లయన్ కింగ్’ (The Lion King) ఇండియాలోనూ మంచి విజయాన్ని అందుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో డబ్ అయి ప్రేక్షకులను ఎంతో అలరించింది. సినిమాలోని జంతువులకు మన తెలుగు నటులు డబ్బింగ్ చెప్పడంతో ఆయా పాత్రలు చిన్న పిల్లలతో సహా పెద్దలను కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) మేకర్స్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.
వాల్ట్ డిస్నీ పిక్చర్స్ బ్యానర్‌పై అడెలె రోమన్ స్కీ, మార్క్ సెరియాక్ నిర్మించిన ఈ సినిమాకు బారీ జెర్కిన్స్ అద్భుతంగా దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 3,200 కోట్లు రాబట్టి రికార్డు సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో ముఫాసా పాత్రకు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), హిందీలో షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) వాయిస్ ఓవర్ అందించారు. థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఫిబ్రవరి 18 నుంచే ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని కారణాలు వల్ల రిలీజ్ కాలేదు. ఎట్టకేలకు మార్చి 26న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు.